ప్రభుత్వ వాహనాలకు వైకాపా రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పార్టీ రంగులు ప్రభుత్వ వాహనాలకు వేయడమేంటని పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కొన్ని రోజులైతే.. పోలీసు యూనిఫామ్‌కు కూడా పార్టీ రంగులు మారుస్తారని.. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏమైందంటే..
గుంటూరులో షీ టీమ్‌లలో పనిచేసే మహిళా పోలీసుల కోసం ద్విచక్రవాహనాలను సమకూర్చారు. అయితే ఈ వాహనాలకు వైకాపా రంగులు వేశారు. వీటిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మహిళా పోలీసులకు అందించారు. వీటిలో ఎక్కువ వాహనాలు పాతవే ఉన్నాయి. వాటికే అధికార పార్టీ రంగులు వేసి పంపిణీ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.
త్వరలో యూనిఫామ్ కూడానా
పోలీసు వాహనాలకు వైకాపా రంగులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా విమర్శించారు. కొంతమంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే.. త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు.. శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృథా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.