YSRCP leaders anarchists: చూశారుగా.. వైఎస్సార్ సీపీ నాయకులు యథేచ్ఛగా చెలరేగిపోతూ.. దాడులు, నేరాలకు తెగబడుతుంటే ఖండించడం పోయి.. తనను తిడితే అభిమానులకు బీపీ పెరుగుతుందంటూ వారి దాడులను సమర్థించుకున్నారు కూడా. అందుకే వీటన్నింటికీ ముఖ్యమంత్రినే వేలెత్తిచూపాలని ప్రతిపక్షాలు, పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై జిల్లా ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించిన దాఖలాలే లేవు.
చట్టం ముందు అందరూ సమానులేనని.. అధికారపార్టీ నాయకులు తప్పుచేసినా వారిపై చర్యలు తీసుకోవాలని ఏనాడూ చెప్పలేదు. పైగా అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు పలికేలా పోలీసు వ్యవస్థను మార్చేశారు. జనాల్ని భయభ్రాంతులకు గురిచేయటం.. తద్వారా వారు ఏం చేసినా మౌనంగా పడుండేలా చేయటమే వీటి వెనక ప్రధాన ఉద్దేశం అని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిల ప్రమేయం గురించి వాస్తవాలు వెలికి తీస్తున్నకొద్దీ సీబీఐ అధికారులను జగన్ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. ఏకంగా దర్యాప్తు అధికారిపైనే కేసు నమోదుచేసింది. అనేక ఆటంకాలు సృష్టించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సీబీఐపైనే ఆరోపణలు చేశారు.
ALSO READ:రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. కార్యకర్తపై దాడి.. వీడియో వైరల్
హత్యలు చేసిన వారికి ప్రోత్సాహమా?..తనవద్ద డ్రైవరుగా పనిచేసే దళిత యువకుడిని చంపేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు.. ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటననే విశ్లేషిస్తే.. అధికారం అండ ఉందన్న ధైర్యం లేకపోతే ఆయన అంతలా బరితెగించగలిగేవారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆయన బెయిలుపై బయటకొచ్చినప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీతో ఊరేగించాయి. తాజాగా రంపచోడవరంలో నిర్వహించిన సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆయనకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు. ఇది అసాంఘికశక్తులకు దన్నుగా నిలవటం కాకపోతే మరేంటి?
పొన్నూరుకు చెందిన దళితుడు అంజి బర్నబాస్‌ను గతేడాది కిడ్నాప్ చేసి చంపేశారు. తన భర్తను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే హత్య చేశారంటూ వారి పేర్లతో బాధితుడి భార్య ఫిర్యాదు చేస్తే.. ఆధారాలు లేవంటూ పక్కదారి పట్టించారు. ఆ తర్వాత ఆమె కూడా నోరు విప్పలేని పరిస్థితి కల్పించారు. ఆరోపణలున్నవారిని కనీసం నిందితులుగా కూడా చేర్చలేదంటే వారి నేరాల్ని ప్రభుత్వం ప్రోత్సహించడం కాదా?