మాచర్లలో ఉద్రిక్తత: బుద్దా, బోండా ఉమపై వైకాపా శ్రేణుల దాడి గుంటూరు జిల్లా మాచర్లలో వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రోడ్లపై కర్రలు, ఇనుపరాడ్లతో తెదేపా ముఖ్య నేతలపై దాడులకు పాల్పడ్డారు. మాచర్ల పట్టణంలోని ప్రధాన రహదారిపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ బొండా ఉమలపై దాడికి దిగారు. ఈ ఘటనలో బొండా ఉమ న్యాయవాది కిశోర్ తీవ్రంగా గాయపడ్డాడు.
పక్కాగా దాడి
మాచర్ల నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో తెదేపా కార్యకర్తలకు అండగా నిలవడానికి ఆ పార్టీ నేతలు అక్కడకు వెళ్లారు. నిన్న తెదేపా వారిని నామినేషన్లు వేయనివ్వకపోవడంతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మాచర్ల నియోజకర్గం వచ్చారు. వీరు వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న వైకాపా శ్రేణులు పక్కా వ్యూహంతో దాడి చేశారు. వైకాపా యువజన విభాగం నాయకులు తెదేపా నేతలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనలో బొండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో తెదేపా నేతలకు ప్రమాదం తప్పింది. కొందరు కార్యకర్తలు రాళ్లు విసరడంతో బొండా ఉమ న్యాయవాది కిశోర్ తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటాడి.. వేటాడి..
ఆ తర్వాత కూడా వైకాపా కార్యకర్తల ఆగడాలు ఆగలేదు. పోలీసు రక్షణతో తెదేపా నేతలు వెల్దుర్తి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారి వాహనాన్ని ద్విచక్ర వాహనాలతో వెంబడించారు. ఈలోగా వెల్దుర్తిలోని వైకాపా కార్యకర్తలకు సమాచారం అందడంతో వారుకూడా అక్కడకు చేరుకున్నారు. మాచర్లలో తమపై జరిగిన దాడిపై తెదేపా నేతలు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. అక్కడా వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. బుద్దావెంకన్న గన్మెన్ పైనా దాడి చేయడంతో అతను పారిపోయాడు. ఆ తర్వాత పోలీసు ఎస్కార్టుతో వీరిని దుర్గి మండలానికి తీసుకెళ్లారు.
బతుకుతామనుకోలేదు..
తెదేపా నేతలపై దాడి జరిగిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు వారితో ఫోన్లో మాట్లాడారు. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల నామినేషన్లను అడ్డుకుంటున్న ఘటనలపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్న ఆయన.. ఈ ఘటన తెలిసిన వెంటనే... వారితో మాట్లాడి వారి స్పందన ప్రత్యక్షంగా వినిపించాారు. నామినేషన్ ప్రక్రియను అడ్డుకున్నారని తెలిసి తాము వెళ్లామని..కారుపై ఒక్కసారిగా దాడి చేశారని ... ప్రాణాలతో బయటపడతామో లేదోనన్న అనుమానం కలుగుతోందని వారన్నారు. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు" అని వివరించారు.
ఇవీ చదవండి:'ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు'