YSRCP Candidates for MLC Elections: శాసన మండలిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించిన సేవలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. జగన్ ఆమోదముద్ర వేసిన అనంతరం స్థానిక సంస్ధలు, ఎమ్మెల్యేలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటాలో:స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా వాటికి అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నేత యాదవ సామాజికవర్గానికి చెందిన నర్తు రామారావుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గ నేత, శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన కుడిపూడి సత్యనారాయణకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఈ జిల్లాలోని తణుకు నియోజకవర్గ నేత, కాపు సామాజికవర్గానికి చెందిన వంకా రవీంద్రనాథ్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అదేవిధంగా ఇదే జిల్లాకు చెందిన పాలకొల్లు నియోజకవర్గ నేత శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గానికి చెందిన నేత, మాల సామాజికవర్గానికి చెందిన మేరుగ మురళీధర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత, బీసీలోని వన్నె రెడ్డి సామాజికవర్గానికి చెందిన సిపాయి సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన నేత, రెడ్డి సామాజికవర్గానికి చెందిన పి. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన వాల్మీకీ బోయ సామాజికవర్గానికి చెందిన ఎ. మధుసూధన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని వాల్మీక బోయ సామాజికవర్గానికి చెందిన ఎస్. మంగమ్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మాజీ ఎంపీ గంగాధర సతీమణి అయిన మంగమ్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే బోయ సామాజికవర్గానికి మేలు జరగడం తద్వారా జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కోటాలో:ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవుల కోసం అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేసి ఆమోదముద్ర వేశారు. 7 ఖాళీలు ఉండగా వాటన్నింటికీ అభ్యర్థులను ప్రకటించారు. శాసనసభలో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా అన్ని పదవులను వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ పరిస్ధితుల్లో తొలి నుంచీ పార్టీకి సేవలందించిన నేతలను ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ నేత, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన పెనుమత్స సూర్యనారాయణ రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.