YSR AROGYA SRI TRUST : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు అందించిన చికిత్సలకు బిల్లులు చెల్లించలేకపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసిన సుమారు 750 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. నెలలు గడుస్తున్నా బిల్లులు రాక ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని చోట్ల వ్యాధి నిర్థారణ పేరుతో రోగుల నుంచి అదనంగా వసూలు చేసున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని సర్కార్: ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కోసం ఉద్యోగుల నుంచి ప్రతినెలా వారి వాటా కింద సొమ్ము ప్రభుత్వానికి జమ అవుతున్నా.. వారికి సంబంధించిన వైద్య బిల్లులనూ ఆసుపత్రులకు సర్కారు చెల్లించడం లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి నిధుల మంజూరు అయితేనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు సమాధానమిస్తున్నారని.. ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అలాగే చికిత్సల సంఖ్యను 3వేలకు పెంచామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు తగ్గట్లుగా బిల్లులు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
దైనందిన స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రులు: ఆరోగ్య శ్రీ ట్రస్టు పరిధిలో సుమారు 2వేల నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 900 వరకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులున్నాయి. కొన్ని ఆసుపత్రులు పూర్తిగా ఆరోగ్య శ్రీ ట్రస్టు నుంచి వచ్చే బిల్లుల పైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఆరోగ్య శ్రీ కార్డులున్నవారికి అందించిన వైద్యానికిగానూ సెప్టెంబరు నుంచి బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు సుమారు 5 కోట్లు, మధ్య స్థాయి ఆసుపత్రులకు కోటి, చిన్న ఆసుపత్రులకు 50 లక్షల రూపాయల చొప్పున చెల్లింపులు ఆగాయి. దీంతో దైనందిన ఖర్చులనూ భరించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యజమాని తెలిపారు. విద్యుత్తు బిల్లులు, సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
నలిగిపోతున్న వైద్యులు, అధికారులు: ఆరోగ్య శ్రీ కార్డులతో వైద్యం కోసం కొత్తగా వచ్చే రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు సంశయిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్తే ఉచితంగా వైద్యం అందుతుందని.. దీనిపై సచివాలయాల ద్వారా బాగా ప్రచారాన్ని కల్పించాలని, 3వేల చికిత్సల వివరాలు అందబాటులో ఉంచాలని పదేపదే చెబుతున్న ప్రభుత్వం.. అందుకు తగ్గట్టుగా చికిత్స అందించిన ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుంటే ఎలా అని ఓ యజమాని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేక.. పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించలేక ఆరోగ్య శ్రీ తరఫున జిల్లాల్లో పనిచేసే వైద్యులు, అధికారులు నలిగిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రోగులకు చికిత్స అందని పరిస్థితులు తలెత్తుతాయని జిల్లా అధికారులు అభిప్రాయ పడుతున్నారు.