ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక సేవలో యువత భాగస్వామ్యం.. గ్రామానికి రెండు క్లబ్‌ల దిశగా చర్యలు - Youth Associations in guntur news update

నవశకానికి నాందిగా యువతను భాగస్వామ్యం చేసే కార్యాచరణ రూపొందుతోంది. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక సేవ దిశగా యువతను నడిపిస్తూనే వారిలో నైపుణ్యాల్ని పెంపొందించడానికి కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, వార్డుల్లో కనీసం రెండు యువజన సంఘాలను ఏర్పాటు చేసి, యువ సేవా సైన్యంతో గ్రామాల రూపురేఖలు మార్చనున్నారు.

Youth Associations at guntur
సామాజిక సేవలో యువత భాగస్వామ్యం

By

Published : Dec 9, 2020, 1:12 PM IST

కేంద్ర యువజన సేవల శాఖ ఆదేశాలతో జిల్లాలోని 712 గ్రామాలు, 12 పట్టణాలు, రెండు నగర పంచాయతీలు, గుంటూరు కార్పొరేషన్‌లో యూత్‌ క్లబ్‌లను నెహ్రూ యువ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఈ సంఘాల్లో 18-27 ఏళ్లలోపు యువత 7 నుంచి 21 మంది ఉంటారు. ఆ సంఘాల ఏం చేయాలన్నది నెహ్రూ యువ కేంద్రం దిశా నిర్దేశం చేస్తుంది. అంతేగాకుండా ప్రభుత్వాలతో పాటు ఎన్జీవోలు యువశక్తిని సద్వినియోగం చేసేలా కలిసి పనిచేయనున్నాయి.

క్రియాశీలకంగా 250 సంఘాలు
గతంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 480 యువజన సంఘాలు నమోదయ్యాయి. వీటిలో 250 సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి. మిగిలిన సంఘాలు అదేవిధంగా పనిచేసేలా ప్రేరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. యువత ఉత్సాహానికి తగ్గట్టుగా కొత్తగా రెండు నుంచి నాలుగు సంఘాలనూ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సంఘంలో సగటున 20 మంది చొప్పున మొత్తం లక్ష మందిని భాగస్వాములుగా చేసే ప్రణాళిక రూపొందింది. అందులో భాగంగా ఈనెల 1 నుంచి 8లోపు 200 సంఘాలను నెహ్రూ యువ కేంద్రం ఏర్పాటు చేసింది. ఒక్కో సంఘం రూ.585లు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడుగురు క్రియాశీలక సభ్యులు, మరో 14 మంది కలిసి సంఘంగా ఏర్పాటైన తర్వాత వారికి నెహ్రూ యువకేంద్రం గుర్తింపు ధ్రువీకరణ పత్రం ఇస్తుంది. అనంతరం కేంద్ర యువజన సర్వీసుల శాఖ అమలు చేసే అన్ని కార్యక్రమాల్లో ఆ సంఘాలు పాల్గొనేలా చూస్తుంది. ఒక్కో సంఘం ఎంపిక చేసిన గ్రామంలోని ఆరు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా పలు సూచనలు చేస్తుంది. మరోవైపు యువత నైపుణ్యాల పెంపునకు కేంద్రం అమలుచేసే అన్ని కార్యక్రమాలపై విద్యార్థులు, నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తుంది.

6 ప్రాధాన్య కార్యక్రమాలు

ప్రధానంగా యువజన సంఘాలు ఆరు ప్రాధాన్యత కార్యక్రమాల్ని చేపడుతుంది. అవి 1. పరిశుభ్ర గ్రామం.. పచ్చని గ్రామం. 2. జల సంరక్షణ కార్యక్రమాలు (జల్‌ జీవన్‌ అభియాన్‌). 3. కొవిడ్‌-19 కట్టడి, లాక్‌డౌన్‌ తర్వాతి పరిస్థితులపై అవగాహన. 4. ఫిట్‌ ఇండియా కార్యక్రమాలు. 5. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాల అమలు. 6. విపత్తుల నిర్వహణ (తుపానులు, వరదలు, కరవు కాటకాల సమయంలో పోషించాల్సిన బాధ్యతలు).

యువత ఉత్సాహం చూపుతోంది
కేంద్ర యువజన సర్వీసుల శాఖ మార్గదర్శకాలతో యువజనోద్ధారణ, సమాజాభివృద్ధికి యూత్‌ క్లబ్‌ల ఏర్పాటుకు నడుం బిగించాం. ఇప్పటికే 200 సంఘాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వాల ప్రగతి కార్యక్రమాలతో పాటు సేవలో యువజన సంఘం సభ్యులను భాగస్వామ్యులను చేస్తున్నాం. పల్నాడు, డెల్టాతో పాటు అన్ని ప్రాంతాల్లో యూత్‌ క్లబ్‌ల ఏర్పాటుకు యువత ఉత్సాహంగా ముందుకు రావడం ఆనందంగా ఉంది. యువశక్తితో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ నవకశం లిఖిస్తుందనడంలో సందేహం లేదు. - డి.కిరణ్మయి, జిల్లా యువజన అధికారి

ఇవీ చూడండి...

గ్రావెల్‌ క్వారీల్లో తిమింగలాలు..!

ABOUT THE AUTHOR

...view details