youngman suicide attempt: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నడిరోడ్డు మీద ఒంటిపై పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక స్థానిక ఎన్టీఆర్ కాలనీ చెందిన రమేష్ అడ్డరోడ్డు సెంటర్ సమీపంలో జాతీయ రహదారిపై శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన చుట్టుపక్కల వారు హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసి.. 108కు సమాచారం అందించారు. అప్పటికే సగానికి పైగా రమేష్ శరీరం కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడి ఉన్న రమేష్‌ను 108 అంబులెన్స్‌లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కౌలురైతు ఆత్మహత్య.. అప్పుల భారంతో కిలారు సాంబశివరావు(40) అనే కౌలురైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. యడ్లపాడు మండలం కొత్తసొలస గ్రామంలో సాంబశివరావు ఎకరం పొలం ఉంది. దాంతోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి పంటలు సాగు చేశాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు అప్పు చేశాడు. తెగుళ్లు, అకాల వర్షాలతో పంటల దిగుబడులు తగ్గాయి. అప్పులకు వడ్డీలు పెరిగిపోవటంతో సాంబశివరావు మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఉదయం తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలోని వేప చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
చెరువులోకి స్నానానికి దిగి..గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చెరువులోకి స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడుకు చెందిన ప్రసన్నకుమార్ (25), నాగుల్ మీరా (22)లు మృతి చెందినవారిగా గుర్తించారు. ఎస్సై రవీంద్రబాబు గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
యువతి మృతి..శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులోని 44వ జాతీయ రహదారిపై 8 రోడ్ల కూడలి వై జంక్షన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాప్తాడు ఎస్ఐ పీవై ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చిలమత్తూరుకు చెందిన కిష్టప్ప కుతూరు రోజా (25), అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన గురుస్వామి కుమారుడు ఈడిగ దినేష్‌లు ఇద్దరూ డీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు అనంతపురం నుంచి ధర్మవరం పంగర్ రోడ్డు వైపు వెళుతుండగా ధర్మవరం పంగల్ రోడ్డు నుంచి.. అనంతపురం వైపు అతివేగంతో వెళ్తున్న టిప్పర్ వై జంక్షన్లో ఢీకొంది.. దీంతో దినేష్, రోజాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడా చికిత్స పొందుతూ రోజు మృతి చెందింది. ఈడిగ రికేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.