E rice app was created by Shiva: హైదరాబాద్ ! ఇదొక మహానగరం లేచింది మొదలు ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితం! కావాల్సింది కొనడానికి కూడా తీరిక లేని సమయం! అందుకే గుండు సూది మొదలు గునపం వరకు.. చివరకి కొబ్బరి చిప్పల నుంచి ఆవు పిడకల వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఇంటికి తెప్పించుకునేందుకే అలవాటుపడింది నగర ప్రజానీకం. ఇది గమనించిన ఈ యువకుడు.. ఈ-రైస్ పేరిట మొబైల్ యాప్ రూపొందించాడు. ఇంటింటికి బియ్యాన్ని సరఫరా చేస్తూ వ్యాపారవేత్తగా ఎదగాలనే కలను నిజం చేసుకున్నాడు.
వినూత్న ఆలోచనతో వ్యాపార రంగంలో రాణిస్తున్న ఈ యువకుడి పేరు శివ. నాగర్ కర్నూల్ జిల్లా చారుగొండకు చెందిన శివ తల్లిదండ్రులు 2010లో హైదరాబాద్‌కు వలసొచ్చారు. బీకాం విద్యనభ్యసించిన యువకుడు రెండేళ్ల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశాడు. తండ్రి కోరిక మేరకు పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి కొద్దిలో దానికి దూరమయ్యాడు. అయినా నిరాశ చెందని శివ తనను తాను నిరూపించుకోవాలనే సంకల్పంతో ఈ-రైస్ మొబైల్ యాప్ రూపొందించా.
2019లో ఈ-రైస్ యాప్ ప్రారంభించిన శివ బియ్యాన్ని నేరుగా రైతుల నుంచే సేకరించే వాడు. ఇందుకు నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, దేవరకొండల్లోని రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాటిని సోనామసూరి, బ్రౌన్ రైస్, హెచ్ఎంటీ రైస్, కోలం రైస్, లష్కరీ కోలం, బాస్మతి, లోజీఐ రైస్, బ్లాక్‌రైస్ ఇలా వివిధరకాల బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు.
E Rice App Was Created By Telangana Boy: ఈ-రైస్ యాప్‌కు మొదట్లో అంతగా ఆదరణ లభించలేదు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నింటిని ఎదురించి.. యాప్‌ను ముందుకు తీసుకెళ్లాడు శివ. మొదట ఒక ద్విచక్రవాహనంపై బియ్యం సరఫరా చేసేవాడు. క్రమంగా కస్టమర్ల ప్రోత్సాహం లభించడంతో 3 వాహనాలు కొనుగోలు చేసి ఎల్బీనగర్ కేంద్రంగా నగరమంతటా సరఫరా చేస్తున్నాడు. తక్కువ ధరకే డోర్ డెలివరీ చేస్తున్న శివ కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తున్నానంటాడు.