గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన పీటర్ పాల్ (30) గతంలో ఓ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు.. ఆమె కుటుంబ పెద్దలు పీటర్ ఇంటికి వచ్చి మాట్లాడి యువతిని తీసుకెళ్లారు. అయితే.. ఆ తర్వాత పీటర్‌పాల్ ఫోన్లో యువతికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయని, వాటిని తొలగించాలని నరసరావుపేట పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
దీంతో.. పోలీసులు పీటర్‌పాల్‌ను స్టేషన్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న సెల్‌పోన్ తీసుకున్నారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్ కోసం ఎన్ని సార్లు స్టేషన్‌కు వచ్చినా.. అధికారులు ఇవ్వకుండా తిప్పుతున్నారని మృతుని తల్లి శాంతమ్మ ఆరోపించారు. ఈ క్రమంలో యువతి బంధువులు, మరి కొందరు తమ ఇంటిపైకి వచ్చి కుమారుడిపై దాడి చేశారని తెలిపింది. వారిలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని, దీంతో.. తనను బతకనివ్వబోరని తన కొడుకు ఆందోళకు గురయ్యాడని వివరించింది.