Yerrabalem Nalla Cheruvu Katta: గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళ్లే ప్రతి వాహనం ఎర్రబాలెం నల్ల చెరువు కట్ట రహదారిపై నుంచే వెళ్లాలి. గతంలో కేవలం గ్రామాల మధ్య రాకపోకలకు మాత్రమే ఈ రహదారిని వినియోగించేవారు. అమరావతి రాజధాని అయ్యాక వాహనాల రద్దీ పెరిగింది. రోజూ వేలాది వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. మంగళగిరి నుంచి రాజధాని గ్రామాలతో పాటు సచివాలయం, హైకోర్టు, శాసనసభ, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ మార్గం మీదుగానే వెళ్తుంటారు. చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు కూడా ఇదే దారిలో వెళ్లి వస్తుంటారు. అలాంటి కీలకమైన రహదారి ఎర్రబాలెం చెరువు కట్టపై ఇరుగ్గా ఉంటుంది. చెరువు నీటి అలలకు రహదారి క్రమంగా కోతకు గురవుతోంది. దీనికి తోడు చెరువుకట్ట వెంట మూడు చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి.
"రెండు కార్లు ఓ సారి చెరువులో పడ్డాయి. ఆ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో చెరువు కోతకు గురైంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆర్ అండ్ బీ అధికారులకు ఫిర్యాదు చేసిన దీనిని పట్టించుకోలేదు"-స్థానికులు
వాహనదారులు రాత్రి సమయాల్లో చెరువు అంచు కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు చెరువులోకి దూసుకెళ్లి మరణిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో.. ప్రమాదాల కారణంగా సుమారు 15మంది వరకు మృతి చెందారు. 2022 జనవరి 17న రాత్రి సమయంలో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లటంతో నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. స్థానికులు సకాలంలో స్పందించి అద్దాలను పగుల గొట్టి కారులో వారిని బయటకు తీసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. రక్షణ గోడ నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.