మహిళలపై ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల అరాచకాలను శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. అమరావతిలో మహిళల బస్సుపై ఎంపీ అనుచరులు దాడులకు పాల్పడటం హేయమైన చర్యని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయన్న యనమల... మహిళలపై ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు నీచంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మహిళలను అసభ్యంగా తిట్టడం, ఫోన్లు లాక్కోవడం అమానుషమన్నారు. తోటి మహిళలకు ఇతర మహిళలు మద్దతు ఇవ్వడం నేరమా అని ప్రశ్నించారు. బాధిత ఆడబిడ్డలకు సంఘీభావంగా మహిళలు రావడం నేరమా అని నిలదీశారు. పోలీసుల అలుసు చూసి వైకాపా రౌడీ మూకలు పేట్రేగుతున్నాయని... వైకాపా పెద్దల అండతో నేరగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దిశ చట్టం తెచ్చామని గొప్పలు చెప్పడం కాదని... రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆక్షేపించారు. చేయని నేరాలకు అక్రమ నిర్బంధాలు చేస్తూ, నేరగాళ్లను యథేచ్చగా వదిలేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మహిళల బస్సుపై దాడి చేసిన ఎంపీ సురేశ్ అనుచరులపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
వైకాపా దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరాయి: యనమల - రాజధాని రైతుల ఆందోళన
గుంటూరు జిల్లా లేమల్లె వద్ద మహిళల పట్ల వైకాపా ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు ప్రవర్తించిన తీరుపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అలుసు చూసుకుని వైకాపా రౌడీ మూకలు పేట్రేగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
yanamala