ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?

YCP MLA Alla Ramakrishna Reddy Resigned: గుంటూరు జిల్లాలో వైసీపీకు పెద్ద షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రం అందజేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన ఆర్కే, అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో వర్గపోరు, ఈసారి టికెట్ రావటంపై అనుమానాలు, పెండింగ్ బిల్లులు రాకపోవటం వల్లే ఆర్కే రాజీనామా చేసినట్లు సమాచారం.

YCP_MLA_Alla_Ramakrishna_Reddy_Resigned
YCP_MLA_Alla_Ramakrishna_Reddy_Resigned

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 7:48 PM IST

YCP MLA Alla Ramakrishna Reddy Resigned: ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజీనామాకి కారణం ఏంటి - ఆయన మౌనం దేనికి సంకేతం?

YCP MLA Alla Ramakrishna Reddy Resigned: సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితునిగా ముద్రపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్కే అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ కార్యాలయంలో ఓఎస్డీకి, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందజేశారు.

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో వెల్లడించారు. ఆ తర్వాత మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అసలు కారణం మాత్రం చెప్పలేదు. రెండుసార్లు తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

వైసీపీలో వర్గపోరు - మంగళగిరిలో పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ప్రారంభం

ఉప ఎన్నికలకు ఆస్కారం లేదు: నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఉప ఎన్నికలకు ఆస్కారం లేదు. ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయటం కొంత అనుమానాలకు తావిస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో కొద్ది నెలలుగా వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన మాజీమంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇవ్వగా, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవికి ఆప్కో ఛైర్మన్ కట్టబెట్టారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి-తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి కార్యాలయం ఏర్పాటు చేశారు.

ఆ మాటలు ఆగ్రహం తెప్పించాయి: ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల పార్టీ కార్యాలయం ఉండగా, దానికి సమీపంలోనే వేమారెడ్డి కార్యాలయం తెరవటం చర్చనీయాంశంగా మారింది. కొత్త కార్యాలయం ఏర్పాటు సందర్భంగా గంజి చిరంజీవితో పాటు, మరికొందరు నేతలు మాట్లాడిన మాటలు ఎమ్మెల్యే ఆర్కేకు ఆగ్రహం తెప్పించాయి. ఇకపై నియోజకవర్గంలో ఏ పని ఉన్నా తమను కలవాలంటూ నేతలు పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం.

మంగళగిరి 'స్వాతిముత్యం' మనసు ఎందుకు విరిగింది ? మరి జలగన్న కామన్​ మ్యాన్​కు నచ్చుతాడా ?!

అందుకే ఈ నిర్ణయం: ఇది తెలిసిన తర్వాతే ఆర్కే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడంపై కూడా ఆళ్ల అసంతృప్తితో ఉన్నారు. నగరంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా రానట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో రెండోసారైనా అవకాశం వస్తుందని ఆళ్ల ఆశించారు. అది కూడా నెరవేరలేదు. ఇప్పుడు ఇతర నాయకుల ప్రమేయం పెరగటం, పనులు జరక్కపోవటం వల్ల రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎవరికీ తెలియదు: పార్టీలో విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నించకపోగా, పార్టీ నాయకత్వమే తన వైరి వర్గానికి మద్దతిస్తోందని భావనకు ఆర్కే వచ్చి, తన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా విషయాన్ని చివరి నిమిషం వరకూ గోప్యంగా ఉంచారు. గన్ మెన్లను రావొద్దని ఆదివారం నాడే చెప్పారు. ఉదయం పెదకాకానిలోని ఇంటికి వెళ్లిన గన్‌మెన్లను వెనక్కు పంపారు. కొందరు ముఖ్య అనుచరులతో కలిసి అసెంబ్లీకి వెళ్లొద్దామని చెప్పి వెళ్లారు. రాజీనామా విషయం అసెంబ్లీకి వెళ్లే వరకూ వారికి కూడా తెలియదు.

ABOUT THE AUTHOR

...view details