YCP Leaders Joined to TDP Presence of Nara Lokesh: వైసీపీ నుంచి ఎమ్మెల్యేలే పారిపోతుంటే, ఇక నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటో అర్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ చేర్చుకోమని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యేనే జగన్ పనైపోయిందంటున్నాడని విమర్శించారు. వరుసగా రెండుసార్లు ఒక్కరినే గెలిపించినా, అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గం వదిలి ఎమ్మెల్యే పారిపోయాడని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలనే లక్ష్యంతో: రాష్ట్రంలో ఎవరిని కదిలించినా వైసీపీ ప్రభుత్వం చేసింది సున్నా అంటున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. పార్టీ శ్రేణులంతా వచ్చే వంద రోజులు అహర్నిశలు కష్టపడి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలనే లక్ష్యంతో వేరే నియోజకవర్గం వైపు చూడలేదని లోకేశ్ వెల్లడించారు. తాను ఓటమి చెందినప్పుడు బాధపడలేదని, ఆ ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకున్నానని లోకేశ్ వెల్లడించారు. మంగళగిరి ప్రజలే నాలో కసి పెంచారన్నారని పేర్కొన్నారు. మంగళగిరి ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెపుదామని లోకశ్ పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రజల కోసం నాలుగున్నరేళ్లుగా సొంత ఖర్చుతో 27సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయి గుప్పుమంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదు: లోకేశ్
మంగళగిరిలోని పేదలకు పక్కా ఇళ్లు: మంగళగిరిలో వైసీపీకి రెండు సార్లు అధికారం ఇస్తే, సంక్షేమ కార్యక్రమాలు జరగలేదని లోకేశ్ తెలిపారు. చివరకూ ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేసిన పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం మంగళగిరి ప్రజలను మోసం చేసిందని వెల్లడించారు. తాను మాత్రం మంగళగిరి ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, మంగళగిరిలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లలో మౌళిక సదుపాయలు కల్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు అబద్దాన్ని కూడా అద్బుతంగా చెబుతారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం నిజాల్ని మాత్రమే చెబుతామని లోకేశ్ వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతఅంగన్వాడీ, పారిశుద్ధ్య, ఆశా వర్కర్లు ఇలా ప్రతి ఒక్కరూ మోసపోయారని లోకేశ్ ఆరోపించారు.