ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 10, 2022, 6:55 AM IST

ETV Bharat / state

మళ్లీ 3 రాజధానుల బిల్లు.. వైకాపా ప్లీనరీలో ఆరు తీర్మానాలు ఆమోదం

THREE CAPITAL: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాల సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతోందని వైకాపా ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని, మళ్లీ 3 రాజధానుల బిల్లు తీసుకొస్తామని వెల్లడించారు.

CAPITAL
CAPITAL

YSRCP PLENARY: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాల సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతోందని వైకాపా ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని, మళ్లీ 3 రాజధానుల బిల్లు తీసుకొస్తామని వెల్లడించారు. ప్లీనరీలో శనివారం ‘పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత’ తీర్మానంపై వారు ప్రసంగించారు.

రాజధాని వికేంద్రీకరణ జరగాలి:రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులుండాలి. మళ్లీ బిల్లు పెడతాం. రాజధాని వికేంద్రీకరణ జరగాలి. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. -నందిగం సురేష్‌ (ఎంపీ)

అభినవ అంబేడ్కర్‌ సీఎం:కరోనా సమయంలో మనం అమలు చేసిన విధానాలను అన్ని దేశాలు అవలంభించాయి. అభినవ అంబేడ్కర్‌ సీఎం జగన్‌. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. -ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్‌

లబ్ధిదారుల ఖాతాల్లోకే సాయం:గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్య వ్యవస్థకు కార్యరూపం ఇచ్చారు. ఎక్కడా అవినీతి లేకుండా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్నారు. -మాజీ మంత్రి పుష్పశ్రీవాణి

మైనార్టీలకు ఉప ప్రణాళిక తెచ్చారు:సీఎం జగన్‌ ఉర్దూను రెండో భాషగా తీసుకొచ్చారు. ఉప ప్రణాళిక ప్రవేశపెట్టారు. వక్ఫ్‌బోర్డు భూముల రక్షణకు చర్యలు తీసుకున్నారు. సచివాలయాల్లో నియామకాలతో మైనార్టీలకు ఉద్యోగాలు లభించాయి. -హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్యే

ఏ గుండె తట్టినా జగన్‌ నినాదమే:రాష్ట్రంలో ఏ గడప ఎక్కినా.. ఏ గుండె తట్టినా జగన్‌ అనే నినాదమే మార్మోగుతోంది. 2024లో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. ఎవరైనా సరే పార్టీ పెడితే వారే అధికారంలోకి రావాలనుకుంటారు. కానీ చంద్రబాబు దత్తపుత్రుడు పార్టీ పెట్టి.. ప్యాకేజీ, డబ్బు కోసం చంద్రబాబే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ దత్త పుత్రుడు ఎవరో మీ అందరికీ తెలుసు. -అంబటి రాంబాబు, మంత్రి

రఘురామను ఎవరూ పట్టించుకోరు:ఎంపీగా పోటీ చేయడానికి ఒక్క ఛాన్స్‌ ఇవ్వన్నా అంటూ జగన్‌ను బతిమలాడుకుని సీటు దక్కించుకున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు దిల్లీలో కూర్చుని రోజూ పార్టీని తిడుతున్నారు. చరిత్ర పుటల్లో ఆయన ఓ అనాథగా మిగిలిపోతారు. ఆయన్ను పట్టించుకునేవారే ఉండరు. 2024లో చంద్రబాబుకు కుమ్ముడే కుమ్ముడు అంటే ఏమిటో చూపిస్తాం. -జోగి రమేష్‌, మంత్రి

జగన్‌ కోసమే పనిచేయాలి:కార్యకర్తలు.. మీరంతా ఒక్కటే గుర్తుపెట్టుకోండి.. నా లాంటివారు వస్తుంటారు. పోతుంటారు. మీరు పట్టించుకోవొద్దు. రాబోయే ఎన్నికల్లోనూ జగన్‌ కోసమే పని చేయండి. జనం, కార్యకర్తల గుండెల్లో ఎవరైతే ఉంటారో వారే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసే రావాలి. అందర్నీ పొట్లం కట్టి పంపిస్తాం. -పేర్ని నాని, ఎమ్మెల్యే

తల్లి ఉద్యోగం పోతుందా?:వైకాపా గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేసినంత మాత్రాన తల్లి ఉద్యోగం పోతుందా? తల్లిని మించిన స్థానం ఏమైనా ఉంటుందా? తన బిడ్డలు ఇద్దరు బాగుండాలని, పదవి ముఖ్యం కాదని ఆమె చెప్పారు. దానిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. -కొడాలి నాని, ఎమ్మెల్యే

తీర్మానాలు.. ఆమోదం:వైకాపా ప్లీనరీలో తీర్మానాల కమిటీ సమన్వయకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం 6 తీర్మానాలను ప్రవేశ పెట్టారు. పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు- ప్రోత్సాహకాలు, ఎల్లోమీడియా- దుష్టచతుష్టయం, పార్టీ నియమావళి అంశాలపై నేతలు మాట్లాడారు. అనంతరం ఆరు అంశాలను ఆమోదించినట్లు ఉమ్మారెడ్డి ప్రకటించారు.

రైతులకు అండగా ఉండాలన్నదే జగన్‌ తపన.. వ్యవసాయంపై తీర్మానంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నది వైకాపా ప్రభుత్వ నమ్మకం. రైతులకు అండగా ఉండాలన్నది జగన్‌ తపన. రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాలాంటి పథకాలను అమలు చేస్తున్నాం. పంట నష్టపోయిన వారికి రూ.6,685 కోట్లు చెల్లించాం. ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కౌలు రైతులకు అన్ని పథకాలను అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో కరవు కాటకాలు లేవు. జలాశయాలు కళకళలాడుతున్నాయి. రుణ మాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తే రైతు భరోసాతో సాయం అందించాం.

ఈ అధికారం జగన్‌ పెట్టిన భిక్ష.. పరిశ్రమలు- ప్రోత్సాహకాల తీర్మానంపై మంత్రి అమర్‌నాథ్‌
ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుభవిస్తున్న అధికారం జగన్‌ పెట్టిన భిక్షే. వైకాపాలో అధికారం చెలాయిస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులు కాళ్లు మొక్కాల్సి వస్తే జగన్‌కు, పార్టీ కార్యకర్తలకు మొక్కాలి. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేశాం. తెదేపాను బంగాళాఖాతంలో కలిపేశాం. మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ వైకాపా. పేదలకు నేరుగా రూ.1.60లక్షల కోట్ల లబ్ధి అందించాం. దీంట్లో ఒక్క రూపాయైనా అవినీతి జరిగిందని ఏ పార్టీ అయినా చెప్పగలదా? చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details