YCP Leaders Comments on Condition of AP Roads:అధ్వానంగా ఉన్న తమ గ్రామ రహదారిని బాగు చేయాలని శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం తురకవాండ్లపల్లి గ్రామస్థులు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన ఒక్క నెల పింఛన్ ఆపితే రోడ్లు వేయవచ్చు అని అన్నారు. ఈయనే కాదు గతంలోనూ మంత్రిగా వ్యవహరించి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మాన ప్రసాదరావు సైతం ఇదే తరహాలో సెలవిచ్చారు. ఈ నెల 20న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ప్రశ్నించారు. పైగా రోడ్లు బాగాలేవు కాబట్టి వైసీపీని వద్దనుకోవద్దని ప్రజలకు హితబోధ చేశారు మంత్రిగారు.
జగనన్న మీద నమ్మకంతో గుంతలో లారీలు దింపారు - అంతే గంటల తరబడి అవస్థలు!
అంతా ఒకతాను ముక్కలే కదా అందుకే ఇంచుమించు ఇలానే చెప్పారు.. మన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదట. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5నుంచి 6 వేల కోట్లు సరిపోతాయని దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలని చెప్పారు. రహదారులు అభివృద్ధికి చిహ్నాలు. రోడ్లు బాగుంటే ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా రుజువైన సూత్రం. జగన్ సర్కారుకు మాత్రం రహదారులంటే పట్టింపే లేదు. అధ్వాన రహదారుల వల్ల కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. ఈ రోడ్డుపై ప్రయాణమా.. వామ్మో అంటూ నిట్టూరుస్తారు.
ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నిఉన్నా రోడ్లు బాగోలేకపోతే అటువైపు వచ్చేందుకు సందర్శకులు ఆసక్తి చూపరు. జాతీయస్థాయిలో రహదారుల నిర్మాణం, విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో జగన్ సర్కారుకు పట్టడం లేదు. గత ప్రభుత్వాలు పథకాలు ఆపి వాటి నిధులతోనే రోడ్లు వేశాయా? వాటిని కొనసాగిస్తూనే కొత్త రోడ్లు వేయడంతో పాటు మరమ్మతులు సైతం చేయలేదా?. రాష్ట్ర, జిల్లా, ఇతర రహదారులు కలిపి 45 వేల కిలోమీటర్ల మేర రాష్ట్రంలో రోడ్లున్నాయి. వీటిలో 9 వేల కిలోమీటర్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. వీటిని తక్షణమే పునరుద్ధరించాల్సి ఉంది. మరో 7,500 కిలోమీటర్ల మేర గుంతలు తేలిఉన్నాయి. కాస్త పర్వాలేదులే అనేవి మరో 8,500 కిలోమీటర్లు ఉన్నాయి.