కర్నూలు జిల్లాలో ..
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును హర్షిస్తూ... నంద్యాల శ్రీనివాసనగర్‌లోని దివంగత నేత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పాలాభిషేకం చేశారు. పాలన వికేంద్రీకరణతో రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్నూలుకు న్యాయరాజధాని రావటం వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని... కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని స్వాగతించారు.. ఈ ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు వస్తాయని... ఎన్నో భవనాలు నిర్మిస్తారని... తాగునీటి సమస్య పరిష్కారానికి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉందని ఎంపీ వివరించారు. వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి హర్షం వ్యక్తం చేస్తూ.. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సహా కార్యకర్తలు ఇతర వైకాపా నేతలు, కొండారెడ్డి బురుజు వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటంతో.. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం... ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైకాపా కార్యాలయం నుంచి.. పి. గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వరకు బాణాసంచా కాల్చి, డప్పులు వాయిస్తూ.. ర్యాలీ చేశారు.
విశాఖ జిల్లాలో..
మూడు రాజధానులకు ఆమోదం తెలిపిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న.. 3 రాజధానుల నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమైనదని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు. సీఎం జగన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో.. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గవర్నర్ నిర్ణయాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్వాగతించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా మాకవరపాలెంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు.
ప్రకాశం జిల్లాలో..
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపటంపై ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఆర్డీఏ బిల్లు రద్దు చేయడం, మూడు రాజధానుల బిల్లు ఆమోదించడం శుభపరిణామమన్నారు.