చంద్రబాబు సహా తెదేపా నేతలు అమరావతిలో 4 వేల ఎకరాలకు పైగా భూములు సొంతం చేసుకున్నారంటూ వైకాపా ఆరోపించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి, రైతులను మోసం చేశారంటూ వైకాపా నేతలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో 21 నిమిషాల వీడియో ప్రదర్శించారు. తెదేపా నేతలు నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్, పరిటాల శ్రీరాం, యనమల అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్, కోడెల కుమారుడు, ప్రత్తిపాటి పుల్లారావు సహా అనేక మంది రాజధాని ప్రకటనకు ముందే చౌకగా భూములు కొన్నారని వీడియోలో చూపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉండి అమరావతిలో భూములు కొన్న 60 మంది తెదేపా బినామీలేనని పేర్కొన్నారు. ఇపుడు చంద్రబాబు సకుటుంబ సమేతంగా అమరావతి చేరుకొని మంటలు రేపుతున్నారని ఆరోపించారు.
భూములు తిరిగిస్తామని అప్పుడే చెప్పాం
రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం లేదని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. బినామీలు, వ్యాపారులు , రియల్ ఎస్టేట్స్‌లు కాకుండా నిజమైన రైతులకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక వచ్చాక చర్చించి రైతులకు న్యాయం చేస్తారని తెలిపారు. అధికారంలోకి వస్తే రైతుల భూములు తిరిగి ఇస్తామని వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే చెప్పారని గుర్తుచేశారు. రాజధాని ఇక్కడే ఉంచుతామని ఎన్నికల ముందు జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు.