YCP Govt is Teaching TOEFL to Students With Maths and Social Teachers:ఈ ఏడాది జూన్ 12న పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ టోఫెల్‌పై అనేక మాటలు చెప్పారు. పేద పిల్లలకు ఆంగ్లభాష నైపుణ్యాలు అందించేందుకు టోఫెల్ తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పిల్లలకు నాణ్యమైన శిక్షణ ఇప్పించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోంది. టోఫెల్ కంటెంట్‌ను ఇంతవరకు ఇవ్వలేదు, ఉపాధ్యాయులకు శిక్షణ అందించలేదు. కానీ, టోఫెల్ చెప్పాలంటూ టీచర్లపై ఒత్తిడి చేస్తోంది. ఏ దేశంలోనైనా టోఫెల్ సిలబస్‌ను ఆంగ్ల సబ్జెక్టు టీచర్లు చెబుతారు. ఇక్కడ మాత్రం సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితం ఉపాధ్యాయులే చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
రోజువారీ బోధనతో తీరిక లేకుండా ఉండే ఈ ఉపాధ్యాయులు టోఫెల్ ఎలా చెబుతారు? ప్రచారం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని పేదపిల్లలపై రుద్దడం జగన్ సర్కార్‌కి పరిపాటిగా మారింది. పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్న టోఫెల్ శిక్షణ అపహాస్యంగా మారింది. 3 నుంచి 5 తరగతులకు టోఫెల్ ప్రైమరీ, 6 నుంచి 9 తరగతులకు టోఫెల్ జూనియర్ నిర్వహిస్తున్నారు. వీరికి ఆంగ్లభాష సబ్జెక్టు ఉపాధ్యాయులతో కాకుండా లెక్కలు, సోషల్ టీచర్లతో పాఠ్యాంశాలు చెప్పిస్తున్నారు.
ఈ సబ్జెక్టుల్లో సిలబస్‌ను సకాలంలో పూర్తిచేయడమే కష్టం. ఇప్పుడు వాటితోపాటు టోఫెల్ శిక్షణా ఇవ్వాలట! వీరికి ఇప్పటివరకు టోఫెల్ గురించిన అవగాహన కల్పించలేదు. మరోపక్క టోఫెల్ తరగతుల కోసమని 3నుంచి 9 తరగతుల్లోని ఆంగ్లసబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగించేశారు. టోఫెల్ బోధనలో కొంత భాగాన్ని ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు అప్పగించిన ప్రభుత్వం.. ఆంగ్ల ఉపాధ్యాయులను టోఫెల్‌కు అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. 3నుంచి 5 తరగతులకు వారానికి ఆరు, 6 నుంచి 9 తరగతులకు వారానికి అయిదు పీరియడ్లు టోఫెల్ చెప్పాలని సూచించింది. వీటి కోసం ఆంగ్లం సబ్జెక్టులో సిలబస్ తగ్గించింది.