ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం వెనకడుగు - అమలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో జగన్ YCP Govt Canceled Free Travel for Women in APSRTC:ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై జగన్ సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ పథకం అమలు చేయాలని తొలుత హడావుడి చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక సైతం తీసుకున్నాక, ఇప్పుడు నెమ్మదించింది. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించిన తరువాత అక్కడ ఎదురైన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ నివేదిక - సంక్రాంతి కానుకగా డోర్ డెలివరీ సేవలు
ఈ నేపథ్యంలో ఇక్కడ అమలు చేయాలా? వద్దా? అనే విషయంలో సందిగ్ధంలో పడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికులు అనూహ్యంగా పెరుగుతారని, దీనివల్ల ప్రస్తుతం అధికంగా ఉన్న డొక్కు బస్సులతో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. బస్టాప్‌లు, బస్టాండ్లలో మహిళా ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షణలు, బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పడటం వంటివి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే ఎన్నికల్లో నెగిటివ్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే టీడీపీ ఈ పథకాన్ని ప్రకటించడంతో, దాన్ని కాపీ కొట్టి ముందుగా అమలు చేశారనే విమర్శలు కూడా వస్తాయా అనేది కూడా సీఎంవో అధికారులు పరిశీలిస్తున్నారు.
జగనన్న మార్క్ మోసం- నా ఎస్సీ, నా ఎస్టీ అంటూనే సంక్షేమాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తూట్లు
ప్రస్తుతం ఆర్టీసీకి 8 వేల 250 సొంత బస్సులు ఉండగా, వాటిలో 4,450 బస్సులు 12 లక్షల కిలోమీటర్లు పైగా తిరగేశాయి. ఇవన్నీ డొక్కుగా మారాయి. ఇందులోనే 1,630 బస్సులు ఏకంగా 15 లక్షల కిలోమీటర్లు పైగా తిరిగాయి. వీటిని తక్షణం పక్కనపెట్టాల్సి ఉంది. కొత్త బస్సులు లేకపోవడంతో వీటినే రోడ్డెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పూర్తిచేసినా, వాటి బాడీ తయారీ పూర్తయి రావటానికి సమయం పడుతుంది. ఈ తరుణంలో ఉచిత ప్రయాణం అమలుచేస్తే, రద్దీకి తగినట్లు బస్సులు రోడ్డెక్కించలేమని ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు తెలిసింది.
హామీ నాది మీరే నెరవేర్చుకోండి - 'జలకళ'కు సీఎం జగన్ ఝలక్
ఒకవేళ ఉచిత ప్రయాణం అమలు చేయాలి అనుకుంటే తెలంగాణ కంటే ఇంకా అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించవచ్చనేది కూడా పరిశీలిస్తున్నారు. ప్రసుత్తం తెలంగాణలో పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో టికెట్ కొనుగోలు చేయాలి. ఏపీలో కూడా పల్లెవెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు దూరప్రాంత సర్వీసులైన డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై మహిళలకు 25 శాతం వరకు రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి రద్దీ తర్వాత ఈ పథకం అమలు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.