YCP Government Scam in Setting up Smart Meters:ప్రజలపై వేలకోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసినా.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్సుకత చూపుతోంది. ఇప్పటికే వేల రూపాయల విద్యుత్ బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతుంటే జగన్ సర్కార్ స్మార్ట్ భారాన్ని సైతం మోపుతోంది. లక్షకోట్లకు పైగా అప్పులతో విద్యుత్ పంపిణీ సంస్థలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోగా.. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం తీసుకునే వేల కోట్ల రూపాయల అప్పు డిస్కంలకు మరింత భారం కానుంది.
మొదటి దశలో మూడు డిస్కంల పరిధిలో 42 లక్షల మీటర్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 1.12 కోట్ల విద్యుత్తు కనెక్షన్లకు కూడా కలిపితే సుమారు 19 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు 20వేల కోట్లు ఖర్చుకానుండగా.. నెలకు 216 కోట్లను అడ్వాన్స్‌డ్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద గుత్తేదారు సంస్థకు చెల్లించాలి. దీన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మీటర్ల విషయంలో సర్కారు చెబుతున్నదానికి, కేంద్రం చూపుతున్న లెక్కలకు పొంతనే లేదు.
YSRCP Government Scams: మీరా స్కీమ్‌ల్లో స్కామ్‌ల గురించి మాట్లాడేది.. మీ లెక్క ఓ సారి చూస్తారా..?
మొదటి దశలో ఏర్పాటు చేసే సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్‌కు జీఎస్టీతో కలిపి నెలకు 86 రూపాయలు, త్రీఫేజ్ మీటరుకు 176 వంతున అదానీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాలి. అధికారుల లెక్క ప్రకారం మొదటి దశలో ఏర్పాటు చేసేవాటిలో త్రీఫేజ్ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన నెలకు 76 కోట్లను అదానీ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం 93 నెలల్లో 7 వేల 069 కోట్లు చెల్లించనున్నారు. ఒక్కో స్మార్ట్ మీటరుకు కేంద్రం ఇస్తున్న గ్రాంటు గరిష్ఠంగా 1350 రూపాయలు మాత్రమే. మొదటి దశలో కేంద్రం ఇస్తున్న వాటా 583కోట్లు కాగా.. మొత్తంగా మొదటి దశలో మీటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 7652 కోట్లు ఖర్చు చేస్తోంది. మిగిలిన 1.12 కోట్ల కనెక్షన్లలో 90 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లకు సింగిల్ ఫేజ్ మీటర్లు ఏర్పాటు చేస్తే.. గుత్తేదారు సంస్థకు 93 నెలలకు 7,198 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేంద్రం ఇచ్చే వాటా 1,512 కోట్లు మాత్రమే.