YCP Government not Buying New RTC Buses:తుక్కు చేయాల్సిన బస్సులను రోడ్డు ఎక్కిస్తున్నారు.. డిపోకే పరిమితం కావాల్సిన బస్సులకు పై పైన రంగులతో మెరుగులు దిద్ది పరుగులు పెట్టిస్తున్నారు. ప్రయాణం భద్రంగా ఉంటుందన్న భరోసాతో బస్సెక్కిన ప్రయాణికులను ప్రమాదాల బారిన పడేస్తున్నారు సగానికిపైగా బస్సులు కాలం చెల్లినా పట్టించుకోవడం లేదు. బస్సులు కొంటాం నిధులివ్వమంటే సీఎం జగన్ ఉలకరు పలకరు నాలుగేళ్లుగా కొత్త బస్సుల కోసం ఎదురుచూపులే. ఛార్జీల పెంపు, రాబడిలో ప్రభుత్వ వాటా వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రయాణికుల భద్రతపై లేదు.. డిపోల్లో బస్సుల విడిభాగాలు ఉండవు. సరఫరాలోనూ భారీ కోత వేస్తారు. ఫలితంగా ఒవైపు ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైసీపీ సర్కారు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఆర్టీసీలో డొక్కు బస్సులు కనిపించడం లేదా జగన్ అంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామాలకు తిరిగే పల్లె వెలుగు బస్సులు కానీ, విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే సిటీ బస్సుల్లో కానీ చాలావరకు.. ఒకరోజంతా తిరిగి డిపోనకు చేరిన తర్వాత తప్పనిసరిగా గ్యారేజ్‌లోకి తీసుకెళ్లి రిపేర్ చేయాల్సిందే. లేకపోతే మర్నాడు అవి బయటకొచ్చే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ సొంత బస్సుల్లో పల్లెవెలుగు సర్వీసులు 3,747 ఉండగా, వీటిలో 3,256 బస్సులు కాలం చెల్లినవే. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు 633 ఉండగా, వాటిలో 402 బస్సులు తిరిగిన కాలం చెల్లినవే. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తిరిగే చాలా బస్సులకు సకాలంలో మరమ్మతులు చేయడంలేదు. అందుకు సమయం కూడా ఇవ్వడంలేదు. ఆటోనగర్ నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్ చేరుకోగానే డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటారు. మరో డ్రైవర్ వెంటనే దానిని తిరుగు ప్రయాణానికి సిద్ధం చేసి తీసుకొస్తారు. వెంటనే మరొక డ్రైవర్ హైదరాబాద్ వెళ్లడం కోసం పాయింట్‌లోకి తీసుకెళ్తారు. ఇలా పలు సర్వీసులకు ఎటువంటి మరమ్మతుల ఊసే ఉండటంలేదు. ఏపీఎస్‌ఆర్టీసీలో బస్సుల్ని ఎలా నడుపుతున్నారో దీనినిబట్టి అర్థమవుతుంది.
రెప్పపాటు వ్యవధిలో బస్సు బీభత్సం - ముగ్గురు బలి - ఈ తప్పిదానికి కారణం ఎవరు?
కాలంచెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతూ ఆర్టీసీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. తెల్లారిలేస్తే.. నా పేదలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్‌కు.. ఆ పేదలే ఎక్కువగా ప్రయాణించే బస్సులు డొక్కుగా మారినట్లు కనిపించడం లేదా? రోజూ బ్రేకులు ఫెయిలయ్యి, స్టీరింగ్ ఊడిపోయి, చక్రాలు ఊడివచ్చి.. ప్రమాదాలకు గురవుతున్న బస్సులు తన కళ్లకు కనిపించకుండా గంతలు కట్టేసుకున్నారా? నిత్యం 35-40 లక్షల మంది ప్రయాణించే బస్సులపై సీఎంకు ఉన్న శ్రద్ధ ఇదేనా? మూడుసార్లు ఛార్జీలు పెంచి, ప్రయాణికులపై ఏటా రూ. 2 వేల కోట్ల భారం వేసినవాళ్లు కొత్త బస్సులు ఎందుకు కొనడంలేదు? ఆర్టీసీ రాబడిలో 25 శాతం తీసుకొని ఖజానాలో వేసుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ఆ సంస్థను గాడిలో పెట్టడంపై ఎందుకు చూపడంలేదు? ప్రాణాలు పోతున్నా.. పేదోళ్లు ప్రయాణించే బస్సులపై దృష్టి పెట్టకూడదని కంకణం కట్టుకున్నారా?.
- నిబంధనల ప్రకారం 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన బస్సులను తుక్కు (స్క్రాప్) చేయాలి. ఏపీఎస్ ఆర్టీసీకి సొంత బస్సులు 8,261 ఉండగా, వాటిలో 4,375 బస్సులు 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేశాయి. అంటే కాలం చెల్లిన బస్సులు 52.95 (దాదాపు 53 శాతం) ఉన్నాయి.
- ప్రస్తుతం ఆర్టీసీలో 12-13 లక్షల కి.మీ. మధ్య తిరిగినవి 759, 13-14 లక్షల కి.మీ. తిరిగినవి 988, అలాగే 14-15 లక్షల కి.మీ. మధ్య తిరిగినవి 1,092 బస్సులు ఉన్నాయి.
- ఏకంగా 15 లక్షల కి.మీ.కు పైగా తిరిగినా ఇంకా రోడ్లపై పరుగులు పెడుతున్నవి 1,536
- దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ 1,163 సర్వీసుల్లో కాలం చెల్లినవి 396 ఉన్నాయి.
- ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 95, ఆల్ట్రా పల్లె వెలుగు 51, ఇంద్ర ఏసీ బస్సులు 21, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు 38 బస్సులు.. 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేశాయి.