రైతుల సమస్యలకు వైకాపాదే బాధ్యత: చంద్రబాబు - formers problems
ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల సమస్యలు వైకాపా ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ సమస్య లేకుండా చూశామని స్పష్టం చేశారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో చర్యల కారణంగానే రాష్ట్రంలో విత్తన సమస్య నెలకొందన్న వైకాపా ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో ఒక్కసారి కూడా ఎరువులు, విత్తన సమస్యలు లేకుండా చేశామని గుర్తు చేశారు. గుంటూరులోని తెదేపా కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిలో పలు వ్యాఖ్యలు చేశారు. తెదేపా వల్లే ఇప్పుడు రైతులు రోడ్డెక్కారని వైకాపా అంటే... ప్రజలు నమ్మే స్థితిలో లేరని చంద్రబాబు అన్నారు. 'మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలు లేకుండా చేశాం. వైకాపా వచ్చిన నెల రోజుల్లో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి' అని చంద్రబాబు అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి తాజా పరిణాలపై చర్చించారు.