తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉంటారనే అక్కసుతో... వైకాపా ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే అదే వైకాపా ప్రభుత్వ పాలనకు చరమగీతం అవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు సమక్షంలో బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పోరాట సమితి అధ్యక్షుడు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్‌తో పాటు 13 జిల్లాల సభ్యులు పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇసుక కొరత కారణంగా పనులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న 60మందిలో 80 శాతం బీసీలే ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా పాలనలో రూ.43వేల కోట్లు బీసీలకు కేటాయించామని... వారి సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. ఉపముఖ్యమంత్రి పదవి సహా 8 కీలక మంత్రిత్వ శాఖలు బీసీలకే ఇచ్చామన్నారు.