స్థానిక సంస్థల ఎన్నికలు పల్నాడు ప్రాంతంలో మళ్లీ పాతకాలం నాటి పెత్తందారి వ్యవస్థను గుర్తుచేస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు అధికారపక్షం బెదిరింపులతో 71 స్థానాల్లో 69 ఏకగ్రీవమయ్యాయి. పురపాలక ఎన్నికల్లోనూ అదే తంతు కొనసాగింది. మొత్తం 31 వార్డుల్లో చివరి నిమిషం వరకు కేవలం వైకాపా అభ్యర్థులే నామపత్రాలు దాఖలు చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా, వామపక్షాలకు చెందిన అభ్యర్థులు ఎవరూ ముందుకు రాలేదు.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన బయటకు రాలేదు. మరో 5 నిమిషాల్లో నామినేషన్ల గడువు ముగియనుండగా... తెదేపా సభ్యులమంటూ నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వారు కేవలం నామపత్రాలు మాత్రమే అధికారులకు అందజేశారు. నగదు డిపాజిట్, ఎన్వోసీ, బీ-ఫారం ఏమీ లేవు. ఓ వ్యక్తి ఎలాంటి వివరాలు లేకుండా కేవలం పేరు రాసి నామపత్రం అందజేశాడు. అతని నామినేషన్ను అధికారులు పక్కన పెట్టేశారు. మిగతా ముగ్గురివి స్వీకరించారు.