ATTACK ON DHULIPALLA VEHICLE: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కారుపై సోమవారం వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. దాంతో కారు వెనుకవైపు అద్దం పగిలిపోయింది. గ్రామ చెరువులో అక్రమ తవ్వకాలను పరిశీలించి, తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ గాయాలు కాలేదు. అనుమర్లపూడికి మాజీ ఎమ్మెల్యే వస్తున్న విషయం తెలుసుకున్న వైకాపా ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు పాములు కలిసి తమ కార్యకర్తలతో గ్రామకూడలి వద్ద వేచి ఉన్నారు. అయితే... నరేంద్రకుమార్ మరోమార్గంలో చెరువు వద్దకు వెళ్లి, పరిశీలించి తిరుగు పయనమయ్యారు. అదే సమయంలో ఎంపీపీ, వైకాపా కార్యకర్తలు చేరుకుని, చెరువు వద్దకు ఎందుకు వచ్చారంటూ నర్రేందకుమార్‌ను ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట జరిగింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నరేంద్రను కారులో ఎక్కించి, పంపించే ప్రయత్నం చేస్తుండగా వైకాపా కార్యకర్త ఒకరు రాయి విసరడంతో కారు అద్దం పగిలిపోయింది. దాంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేవారు. పక్క గ్రామమైన తంగెళ్లమూడితోపాటు గుంటూరులో నరేంద్రకుమార్ విలేకరులతో మాట్లాడారు
‘రోడ్లు, జగనన్న కాలనీలకు మట్టి తరలింపు పేరిట వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా చెరువుల్లో మట్టిని తవ్వేస్తున్నారు. ఒక ట్రాక్టరు మట్టికి రూ.1000లకు విక్రయించి ఎంపీపీ శ్రీనివాసరావు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి స్థానిక సర్పంచి భర్త పాములు సహకరిస్తున్నారు. అక్రమ తవ్వకాలను అధికారుల దృష్టికెళ్లినా పట్టించుకోకపోవడం దారుణం. తవ్వకాల పరిశీలనకు వెళితే వైకాపా వారు దాడులకు ప్రయత్నించడం అప్రజాస్వామికం. మేం ఎవరికీ భయపడేది లేదు. గొడవలకు దిగితే చూస్తూ ఊరుకోం’-ధూళిపాళ్ల నరేంద్రకుమార్