ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దావోస్​ సమ్మిట్​పై ప్రభుత్వానికి సోయి లేదు - దృష్టంతా రాబోయే ఎన్నికల పైనే

World Economic Forum meeting in Davos: రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఏమవుతుంది. కొత్తగా కంపెనీలు ఏర్పడతాయి. యువతకు ఉపాధి దొరుకుతుంది. రాష్ట్ర ఖజనాకు అదనపు ఆదాయం సమకూరుతుంది. వలసలు తగ్గి జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. కానీ, సీఎం జగన్‌కు ఇవన్నీ అనవసరం. అప్రస్తుతం. వచ్చే ఎన్నికలపైనే ఆయన దృష్టంతా.

world_economic_forum_meeting_in_davos
world_economic_forum_meeting_in_davos

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 9:17 AM IST

దావోస్​ సమ్మిట్​పై ప్రభుత్వానికి సోయి లేదు - దృష్టంతా రాబోయే ఎన్నికల పైనే

World Economic Forum meeting in Davos: రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పుల, చేర్పులపై తీరిక లేకుండా గడుపుతున్న ముఖ్యమంత్రి దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకూ డుమ్మాకొట్టారు. కనీసం ప్రతినిధుల బృందానికీ అక్కడికి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు. ఐదేళ్ల కాలంలో కేవలం ఒక్కసారే దావోస్‌కు వెళ్లిన జగన్‌, విదేశీ కంపెనీల నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులను కూడా తేలేకపోయారు.

పరిశ్రమలు వస్తే మనకేంటి. రాకపోతే మనకేంటి. పెట్టుబడిదారులు వస్తే ఏంటి. పోతే ఏంటి. రాష్ట్రం ఏమైపోతే మనకేంటి. ఏదోటి చేసి తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే, మరో ఐదు సంవత్సరాల పాటు, కడుపులో చల్ల కదలకుండా ‘వర్క్‌ ఫ్రం హోం సీఎం' గా కొనసాగవచ్చు. సంక్రాంతి వంటి పండగ సందర్భాల్లోనూ అడుగు బయటపెట్టకుండా, ఇంటి పెరట్లోనే భారీ సెట్టింగులు వేయించుకుని పండుగలు చేసేసుకోవచ్చు.

దావోస్​లో తెలంగాణాకు పెట్టుబడుల ప్రవాహం.. రూ.2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్

అసలే చలికాలం ఇప్పుడు దావోస్‌లూ, గీవోస్‌లూ అంటే కుదిరే పనే కాదు. అయినా మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనకెందుకులే ఆ దావోస్‌లూ అవీ. ఇలాగే ఉంది మన ముఖ్యమంత్రి జగన్‌ తీరు. ఏటా దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు ఈసారి కూడా జగన్‌ డుమ్మా కొట్టారు. ఆయన వెళ్లలేదు సరికదా, కనీసం రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందాన్నీ పంపలేదు. రాష్ట్రానికి పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించడంపై జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.

దావోస్‌, స్విట్జర్లాండ్‌లోని చిన్న పట్టణం. ఏటా జనవరి వచ్చిందంటే వివిధ దేశాల అధినేతలు, మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి కంపెనీల ఛైర్మన్లు, ఎండీలు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలుతారు. డబ్య్లూఈఎఫ్​ కు రమ్మని ఆహ్వానం అందడమే గౌరవంగా భావిస్తారు.

విశాఖ సమ్మిట్‌తో భారీగా పెట్టుబడులు వచ్చాయంటూ మోసం చేస్తున్నారు: సత్యకుమార్​

అక్కడ ఏటా వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయి. సోమవారం నుంచి దావోస్‌లో మొదలైన 54వ వార్షిక సమావేశాలకు మన దేశం నుంచి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, అశ్వినీ వైష్ణవ్, హర్‌దీప్‌సింగ్‌ పురీతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్‌రెడ్డి, సిద్ధరామయ్య, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేతో పాటు ఆయా రాష్ట్రాల మంత్రులు, మన దేశం నుంచి 100 మందికిపైగా సీఈఓలు హాజరవుతున్నారు. చైనా ప్రధాని లీ కియాంగ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా నుంచి మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులు సైతం వార్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్కింగ్‌కు, రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకు అవకాశమున్న అలాంటి సమావేశాలకు వెళితే నాలుగు కంపెనీలను ఆకర్షించే వీలుంటుందన్న కనీస స్పృహ జగన్‌ సర్కారుకు లేదు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు క్రమం తప్పకుండా డబ్ల్యూఈఎఫ్​ సమావేశాల్లో పాల్గొంది.

'ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సత్తా..

మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలన్నిటిలోకీ ఏపీ పెవిలియన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. కొత్తగా ఏర్పడిన ఏపీకి అంతర్జాతీయ యవనికపై బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు సమావేశాలు దోహదపడ్డాయి. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో 2022లో ఒకే ఒక్కసారి డబ్ల్యూఈఎఫ్​ సమావేశాల్లో పాల్గొన్నారు.

అప్పుడు కూడా దావోస్‌కు వెళ్లి ఆయన ఒప్పందాలు చేసుకుంది కేవలం నాలుగే నాలుగు భారతీయ కంపెనీలతో, వాటితో కూడా అంతకుముందే ఇక్కడ అవగాహన కుదిరాక దావోస్‌కు పిలిచి అక్కడ లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్టు గొప్పలు చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలేవో తెలుసా. అదానీ, గ్రీన్‌కో, అరబిందో, ఆర్సెలర్‌ మిత్తల్‌. వాటిలో మొదటి మూడూ అధికార పక్షానికి అత్యంత అనుకూలంగా ఉంటున్నవారి కంపెనీలే. అరబిందో అయితే వైఎస్సార్​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడిదే.

'ఏపీలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు.. దావోస్ వేదికగా ఎంవోయూలు'

ఆ మూడు కంపెనీలతోనూ హరిత ఇంధన రంగంలో లక్షా25 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్టు జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఎన్ని ఆచరణలోకి వచ్చాయో తెలీదు. ఆర్సెలర్‌ మిత్తల్‌తో అప్పటికే విశాఖలో ఉన్న పరిశ్రమల విస్తరణకు సంబంధించి మరో వెయ్యి కోట్లకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్‌ ఒప్పందాల్లో లోటుపాట్లు ఉన్నాయని, సమీక్షిస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడి చేసిన జగన్‌, తీరా దావోస్‌కు వెళ్లి ప్రధానంగా విద్యుత్‌ రంగంలోనే, అదీ భారతీయ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకోవడం విశేషం. ఏతావాతా రూపాయి కూడా విదేశీ పెట్టుబడి రాలేదు.

అప్పట్లో ముఖ్యమంత్రి జగన్‌ సతీసమేతంగా ప్రత్యేక విమానంలో దావోస్‌కు ప్రయాణమయ్యారు. నేరుగా దావోస్‌ వెళ్లకుండా మొదట లండన్‌ వెళ్లి, అక్కడి నుంచి దావోస్‌కు చేరుకున్నారు. లండన్‌లో చదువుతున్న కుమార్తె వద్ద తన సతీమణిని విడిచిపెట్టి సీఎం దావోస్‌కు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఆయన మళ్లీ లండన్‌ వెళ్లి సతీమణిని తీసుకుని ఇక్కడికి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

'స్టార్టప్ హబ్​గా విశాఖను మారుస్తాం'.. దావోస్ సదస్సులో సీఎం జగన్

సొంత అవసరాల కోసం ప్రజాధనాన్ని దుబారా చేశారంటూ అప్పట్లో విపక్షాల విమర్శలూ వెల్లువెత్తాయి. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో 2021లో కొవిడ్‌ వల్ల డబ్ల్యూఈఎఫ్​ సమావేశాలు జరగలేదు. 2020, 2022, 2023, 2024లో సమావేశాలు జరిగాయి. వీటిలో 2022 సమావేశాలకు మాత్రమే సీఎం, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, అధికారులు హాజరయ్యారు.

2023లో ఎందుకు వెళ్లలేదంటే, విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించి ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడికే రప్పిస్తున్నామని, అందుకే వెళ్లలేదని పరిశ్రమల మంత్రి సాకులు చెప్పారు.

Davos Summit: గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపనకు ఏపీ అనుకూలం: సీఎం జగన్‌

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నప్పుడు దావోస్‌కు వెళ్లకపోయినా, 2018, 2019, 2020, 2022, 2023ల్లో మంత్రి కేటీఆర్‌ సారథ్యంలో ఆ రాష్ట్ర ప్రతినిధి బృందం సమావేశాల్లో పాల్గొంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో క్రియాశీలంగా వ్యవహరించింది. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో, ప్రతినిధి బృందం ఈ ఏడాది దావోస్‌కు వెళ్లింది.

విదేశీ కంపెనీల్ని మన రాష్ట్రానికి ఆకర్షించాలంటే మనకున్న బలాలు, ఇక్కడున్న అవకాశాలు, రాష్ట్రానికి వస్తే ఇచ్చే రాయితీలవంటి అంశాల్ని సమర్థంగా వివరించగలగాలి. రాష్ట్ర బృందానికి సారథ్యం వహించే ముఖ్యమంత్రి, మంత్రి సీఈఓ అవతారమెత్తాలి. మనం దావోస్‌కు వెళ్లి అడిగినంత మాత్రాన ఏ కంపెనీ కూడా, గంటలోనో, రోజులోనో వేల కోట్ల పెట్టుబడులపై నిర్ణయం తీసేసుకుని అప్పటికప్పుడు ఒప్పందాలు చేసుకోదు.

కొన్ని నెలల ముందునుంచే సంప్రదింపుల ప్రక్రియ, కసరత్తు జరగాలి. అన్ని రకాల ముందస్తు అవగాహనలతో సిద్ధంగా ఉంటే దావోస్‌ వంటి వేదికలపై ఒప్పందాలు చేసుకునే వీలుంటుంది. అలాంటి కసరత్తు చేసే తీరిక, ఓపిక జగన్‌ ప్రభుత్వానికి లేనందునే పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలేవీ ముందుకు రావడం లేదు.

ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్​​.. 33 గంటలకు 10 లక్షల మంది నిరుపేదలు!

ABOUT THE AUTHOR

...view details