ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కిడ్స్ టెకోవర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనాథ విద్యార్థినీలకు ఒక్కరోజు ఛైర్ పర్సన్, కమిషన్ సభ్యులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. విలు విద్యలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థిని కన్నెపొటి జోత్స్నను కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ సందర్బంగా విద్యార్థినులు సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టులో వచ్చి గుంటూరులోని కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని కమిటీ సభ్యులతో కలసి కన్నెపొటి జోత్స్న ప్రతిజ్ఞ చేశారు.
పిల్లల్లో స్ఫూర్తిని నింపేందుకు కిడ్స్ టేకోవర్ కార్యక్రమాన్ని చేపట్టామని కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విలు విద్యలో ప్రతిభ చూపిన బాలికను ఛైర్‌పర్సన్‌గా నియమించి మహిళల రక్షణ కోసం కమిషన్ చేస్తున్న కార్యక్రమాలను వివరించామన్నారు. కిడ్స్ టేకోవర్ కార్యక్రమ స్ఫూర్తితో బాలలు ఉన్నతస్థాయికి ఎదగాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు.