అమరావతి ఆశలు నేలకూలి, రైతులు రోడ్డెక్కిన వేళ.. అక్కడ నివసించే కార్మికులు, వ్యవసాయ కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. రాజధాని నిర్మాణం తలపెట్టిన వేళ... భూములు లేని నిరుపేద వ్యవసాయ కూలీలు, కార్మికుల కుటుంబంలో ఒకరికి నెలకు 2వేల500 రూపాయల పింఛన్ సదుపాయాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలో ఇలా పింఛన్ పొందుతున్న వారు 21వేల 760 మంది ఉన్నారు. రాజధాని రాకతో వ్యవసాయ పనులు ఆగిపోయినా...భవన నిర్మాణ పనులతో కూలీలకు చేతినిండా పని దొరికేది. మట్టి తవ్వకాలు, తాపీ పనులు సహా...మెకానిక్‌లు, డ్రైవర్లు, సెక్యురిటీ గార్డులు, గుమస్తాలుగా ఉపాధి పొందేవారు. అయితే..ఒక్కసారిగా ఆయా బడుగుల జీవితాలు తలకిందులయ్యాయి. కూలీలకు ఉపాధి కరవు కాగా... రోజుకు వెయ్యి రూపాయల వరకూ సంపాదించుకొనే వారు.. ప్రస్తుతం 2వందలు కూడా తెచ్చుకొనే పరిస్థితి లేక విలవిల్లాడుతున్నారు. ఉన్న ఊరులో ఉపాధి లేక, ఎక్కడికీ పోలేక.... బడుగు జీవులు నరక యాతన అనుభవిస్తున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న అరకొర పింఛన్ ఏ మూలకూ సరిపోవడం లేదంటున్న కూలీలు.. అది కూడా కొన్నిసార్లు 2, 3 నెలల వరకూ అందడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితులకు తోడు కరోనా, ఇసుక కొరత తోడై తమ జీవితాలు మరింత దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలను పంటి బిగువున భరిస్తూ ఇలా ఎన్నాళ్లు నెట్టుకురోవాలో తెలీక బడుగు జీవులు మనోవేదనకు గురవుతున్నారు.