అత్తారింట్లోకి దారేది... పదిరోజులుగా గేటు వద్దే కోడలు భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంతో ఉన్న మహిళను చేరదీసి ఓదార్చాల్సిన అత్తాఆడపడుచులే ఆమె పాలిట శత్రువులుగా మారారు. ఇద్దరు చిన్నారులతో 10 రోజులుగా అత్తారింటి వద్దే.. ఆరుబయట పిల్లలతో పడిగాపులు కాస్తోంది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన అనూషకు ఎనిమిదేళ్ల క్రితం గుంటూరు చుట్టుగుంటకు చెందిన క్రాంతి కుమార్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గతేడాది డిసెంబర్లో క్రాంతి కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. తన పిల్లలతో కలిసి అనూష పిడుగురాళ్లలోని తల్లిగారింటికి వెళ్లింది. అక్కడినుంచి తిరిగి... అత్తారింటికి వచ్చింది.
అత్త రాములమ్మ ఇంటికి వచ్చిన అనూషకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అక్కడకు వచ్చేటప్పటికే అత్త ఇంటికి తాళం వేసుకుని కూతుర్ల వద్దకు వెళ్లింది. దీంతో పది రోజులుగా అనూష అత్త ఇంటి ఎదుటే నిరసన తెలియజేస్తోంది. స్థానికులు ఇచ్చిన ఆహారం తింటూ.. రాత్రిపూట సమీప దేవాలయంలో నిద్రిస్తోంది. భర్త లేకుండా పోయాడని.. అత్తింట్లోకి వెళ్దామంటే ఇంటికి తాళం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
తనకు న్యాయం చేయాలని గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా... కోర్టులో తేల్చుకుంటామని అత్త ఆడపడచులు చెబుతున్నారని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి వద్ద నుంచి కదిలే ప్రసక్తే లేదని అనూష చెబుతోంది.
ఇదీ చదవండి: జులై 8న ఉచిత ఇళ్లస్థలాల పట్టాలు పంపిణీ: సీఎం జగన్