Complaint by women lawyers against Ramgopal Varma : దర్శకుడు రాంగోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మతో పాటు ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు పెదకాకాని సీఐ సురేష్ బాబుకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఆచార్య నాగార్జున వర్సిటీలో జరిగిన అకాడమిక్ ఎగ్జిబిషన్లో దర్శకుడు రామగోపాల్ వర్మ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారని వారు గుర్తు చేశారు. మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిగా వర్మ వ్యవహరించారని వారు విమర్శించారు. ప్రపంచంలో మగవారంతా చనిపోయి వర్మ మాత్రం మిగిలి ఉండాలన్న ఆయన వాదనను మహిళా న్యాయవాదులు ఖండించారు. విద్యార్థులుండే ఇలాంటి వేదికపై పర్వర్టెడ్ రాంగోపాల్ వర్మను రప్పించిన వీసీపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదును స్వీకరించిన సీఐ సురేశ్ బాబు... న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులో ముందుకువెళ్తామని చెప్పారు.
యూనివర్సిటీలో ఆర్జీవీ మాట్లాడిన తీరు మహిళల మనోభావాలు దెబ్బతినేలా ఉంది. కాబట్టి వీసీతో పాటు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాం. 25ఏళ్లు పూర్తయిన తర్వాత ఆయనకు పట్టాతో ఏం అవసరం వచ్చిందో.. ఆయన్ను పిలిపించాల్సిన అవసరం ఏం వచ్చిందో వీసీకి, ఆయనకే తెలియాలి. విద్యార్థుల ముందు ఆయన వ్యవహారశైలి చాలా అసహ్యంగా ఉంది. తగిన చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుంది. - లక్ష్మీ సుజాత, మహిళా న్యాయవాది