భర్త ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తాడు. అతడు ఉదయం ఆఫీసుకు వెళ్లగానే ఆమె తలుపులు వేసుకుంది. బెడ్రూంలోకి వెళ్లి అక్కడున్న వస్తువులు, బట్టలన్నీ చిందరవందరగా పడేసింది. ఆ తర్వాత బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగలు, 3 వేల రూపాయల నగదును తీసి దాచిపెట్టింది. అనంతరం పడుకుంది. భర్త ఇంటికి చేరుకోగానే లేచి... మన ఇంట్లోకి ఎవరో దుండగులు వచ్చి నాపై ఏదో మత్తు మందు చల్లారని తెలిపింది. అంతేనా... ఇంట్లో ఉన్న బంగారు నగలతో పాటు నగదు తీసుకెళ్లారని వివరించింది. ఇప్పుడే నాకు మెల్కువ వచ్చిందంటూ భయాన్ని నటించింది.
ఏం చేయాలో పాలుపోని ఆమె భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటూహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారంగా వేలిముద్రలు సేకరించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో... ఆమెను నిలదీశారు. అప్పటి వరకూ దొంగతనం జరిగిందని చెప్పిన ఆమె... అలాంటిదేం లేదని వివరించింది. విషయం విన్న పోలీసులు, ఆమె భర్త అవాక్కయ్యారు. తానే బట్టలు, వస్తువులు పడేసి నగలు, నగదు దాచేసినట్లు స్పష్టం చేసింది.
గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్‌లో గుంటూరు డ్వామా కార్యాలయంలో పనిచేసే అధికారి ఉంటున్నారు. ఆయన గురువారం ఉదయం పనిపై బయటకు వెళ్లారు. భార్య ఇంట్లో పని చేసుకుంటోంది. ఫ్ల్లాట్‌లోకి ప్రవేశించి ఆమె ముఖంపై మత్తుమందు చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఇద్దరు దుండగులు పడకగదుల్లోకి ప్రవేశించి ఆయా గదుల్లోని కప్‌బోర్డులలో దుస్తులు లాగేసి మంచంపై పడేశారు. ఓ గదిలో రెండు బీరువాల తలుపులు తెరిచి ఉండడంతో అందులోంచి 30 తులాల బంగారు నగలు, రూ.3వేలు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి భర్త ఇంటికి వచ్చారు. అప్పటికి తేరుకున్న గృహిణి విషయాన్ని తన భర్తకు వివరించింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజీలు చూశారు. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనబడలేదు. చివరికి గృహిణి వేలిముద్రలతో సరిపోల్చగా ఆమెవేనని తేలడంతో అవాక్కై విచారించారు. అదంతా కట్టుకథగా తేలింది. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా వ్యవహరించినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు.
ఇదీ చూడండి:CM Jagan Kadapa Tour: త్వరలో సీమ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్