పుట్టిన బిడ్డను ఇచ్చేయాలని, తనను మాత్రం కాపురానికి రావొద్దంటూ కట్టుకున్న భర్త వేధిస్తున్నాడని ఓ బాలింత పోలీసు అధికారుల ముందు కన్నీంటిపర్యంతమైంది. కరోనా కాలంలో... 40 కిలోమీటర్ల దూరం నుంచి 25 రోజుల పసివాడిని తీసుకొని ఆమె గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ స్పందన కార్యక్రమానికి వచ్చిన జనం రద్దీ చూసి కొవిడ్ పరిస్థితుల్లో తాను బిడ్డతో వెళితే.. బాబుకు వైరస్ వల్ల ప్రమాదం సోకే అవకాశం ఉండడంతో బిడ్డను ఆటోలో ఉంచి ఏఎస్పీ మూర్తిని కలిసి తన ఆవేదనను వివరించింది.
'నా పేరు ఊరుగంటి అశ్విని. మాది పేద కుటుంబం. బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామం. నాన్న ఆటోడ్రైవరు. అమ్మ గృహిణి. నేను బీఎస్పీ వరకు చదువుకున్నా. ఆర్మీలో పని చేస్తున్న పాత పొన్నూరుకు చెందిన కావూరి సాంబశివరావు సంబంధం రావడంతో అందరూ సంతోషించారు. నీవు అదృష్టవంతురాలినని..సైన్యంలో ఉద్యోగం చేసే వాడు భర్తగా వస్తున్నాడని.. జీవితం బంగారుమయమని అందరూ చెప్పారు. నేనూ ఎంతో ఆనందపడ్డా. ఏడాదిన్నర కిందట పెద్దలు మా వివాహం ఘనంగానే జరిపించారు. ఆ తర్వాత అంతా బాగానే జరిగింది. కొద్ది నెలల నుంచి భర్తతో పాటు అత్తా అధిక కట్నం కోసం వేధింపులు ప్రారంభించారు. మా నాన్న ఆటో నడిపితేనే మా కుటుంబం నడిచేది. అలాంటి వారు నాకు కట్నంగా డబ్బులు ఇచ్చే స్థితిలో లేరు. వారిని ఇబ్బంది పెట్టకూడదని భావించా.
భర్త వేధింపులు భరించలేక చచ్చిపోదామని.. ఆత్మహత్యయత్నం చేసుకుంటుండగా స్థానికులు అడ్డుకున్నారు. పెద్దలు సర్దిచెప్పారు. ఆ తర్వాత నేను మూడు నెలల గర్భవతిని కావడంతో నన్ను నా పుట్టింటికి పంపించారు. నేను బాబుకు జన్మనిచ్చాను. ఇప్పుడు నా భర్త నీవు పొట్టిగా ఉన్నావని.. నాకు అవసరం లేదంటున్నాడు. మగబిడ్డ నాకు కావాలని.. వాడిని తీసుకువెళ్తానని బెదిరిస్తున్నాడు. పెద్దలు మాట్లాడితే.. భార్య వద్ధు. బిడ్డను ఇచ్చేయమంటూ గొడవపెట్టుకుంటున్నాడు. రోజుల పసివాడిని నా నుంచి దూరం చేస్తారేమోనని భయంగా ఉంది. వాడే నా సర్వస్వం. వాడిలేనిది నేనూ బతకలేను..