పింఛన్ డబ్బుల కోసం భార్యను భర్త చంపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. అమర్తలూరు మండలం యలవర్రు గ్రామానికి చెందిన శామ్యూల్ తన భార్య ఏపరాయమ్మతో విభేదాల కారణంగా కొన్నేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. అయితే ఆమెకు నెలనెలా పింఛన్ వస్తున్నందున శామ్యూల్ పెన్షన్‌కు అనర్హుడుగా అధికారులు ప్రకటించారు. దీంతో వచ్చే పింఛన్లో సగం తనకు ఇవ్వాలని ఇటీవల తరచూ గొడవ పడుతున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 1న ఆమెకు పింఛన్ వచ్చింది. సగం డబ్బు తనకు ఇవ్వాలని శామ్యూల్ అడిగాడు. ఆమె ఇవ్వటానికి నిరాకరించింది. ఫలితంగా కోపం పెంచుకున్న శామ్యూల్... ఇవాళ తెల్లవారుజామున ఏపరాయమ్మ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. కర్రతో విపరీతంగా కొట్టడం వల్ల ఆమెకు తీవ్రగాయాలు కాగా.... ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందింది.