కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలను ఎందుకు తయారుచేస్తారు? దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు...కొందరు భక్తులు టెంకాయ, అరటిపళ్లు పెడితే... మరికొందరు వడపప్పు, ఉండ్రాళ్లు పెడతారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండపై వెలసిన శివయ్యకు మాత్రం.... 90 నుంచి 100 అడుగుల ఎత్తున నిర్మించిన ప్రభను భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. త్రికోటేశ్వరుని కొలిస్తే తమను, తమ గ్రామాలను చల్లగా చూస్తాడని ఇక్కడి వారి విశ్వాసం. అందుకే వ్యయప్రయాసలకోర్చి భారీ ప్రభలను తయారు చేస్తారు. శివరాత్రి రోజున కొండ కింద భాగంలో రాత్రంతా జాగరణ చేస్తూ.. విద్యుత్ ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
కోటయ్య కొండ దిగి వస్తాడని...
శివరాత్రి వచ్చిందంటే చిలకలూరిపేట, నరసరావుపేట మండలాల్లో సందడి నెలకొంటుంది. గ్రామస్థులందరూ కుల, మతాలకు అతీతంగా ప్రభల తయారీలో పాల్గొంటారు. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం, కావూరు, మద్దిరాల, యడవల్లి, అమీన్ సాహెబ్ పాలెం.... నరసరావుపేట మండలం ఉప్పలపాడు, యలమంద నుంచి విద్యుత్ ప్రభలు కోటప్పకొండను చేరుకుంటాయి. కోటొక్క ప్రభలు సమర్పిస్తే ఆ కోటయ్య... కొండ దిగి వచ్చి తమను ఆశీర్వదిస్తాడని భక్తుల నమ్మకం. ఇది కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయమని చెబుతారు ఇక్కడి స్థానికులు.
రూ.20 లక్షల ఖర్చు
కోటప్పకొండ తిరుణాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునే ప్రభల తయారీ వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. ఒక్కో ప్రభ కోసం 20 రోజల పాటు గ్రామంలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ నిర్మాణంలో పాల్గొంటారు. ఒక ప్రభ నిర్మాణానికి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తారు. విద్యుత్ ప్రభలను తయారుచేసే సమయంలో... యువకులు ప్రమాదాల పాలైన సందర్భాలున్నాయి. ప్రభలపై శివయ్య ప్రతిమతోపాటు.... పక్కనే తమకు నచ్చిన నాయకులు, సినీనటుల బ్యానర్లను ఏర్పాటు చేస్తారు. ఇక వీటిని వివిధ గ్రామాల నుంచి కోటప్పకొండ కిందకు తరలించడం మరో ప్రయాస. ఏమాత్రం అజాగ్రత్త వహించినా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. విద్యుత్ ప్రభలు తరలించేటప్పుడు గ్రామాల్లో విద్యుత్తు వైర్లను తాత్కాలికంగా తొలగిస్తారు. పొడవైన విద్యుత్ ప్రభలు పూర్తిగా ఏ వైపో వాలిపోకుండా తాళ్ల ద్వారా కట్టి బిగించి... వాటిని గ్రామస్థులే పట్టుకుంటారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే వీటిని పోలీస్, విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలో తరలిస్తారు.
ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ స్థిరపడినా శివరాత్రికి మాత్రం తప్పకుండా ఊరికి చేరుకుంటారు. విదేశాల్లో ఉండే వారు సైతం ఈ పండగకి స్వస్థలానికి వస్తుంటారు. ప్రభలు తరలివెళ్లే సమయంలో ఆ గ్రామాల్లో సందడి నెలకొంటుంది.
ఇదీ చదవండి:
శివరాత్రికి ఏ ఆలయంలో ఏం చేయబోతున్నారు?