వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీనందిగం సురేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు శృంగారపాటి సందీప్, సలివేంద్రం సురేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగనే తమను కాపాడాలని కోరారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నియోజకవర్గంలో అనేక అవినీతి కార్యక్రమాలకు తెరతీశారు. ఎంపీ సురేష్ తెదేపా నేతలతో కలిసి పోయి వైకాపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. నాపై ఉద్దేశపూర్వకంగానే ఒక్క రోజులో మూడు కేసులు పెట్టారు. హైకోర్టులో వేసిన కేసులు తక్షణం వెనక్కు తీసుకోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే సీఎం జగన్ను కలిసి విషయాన్ని వివరిస్తాం. తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్ వైకాపాను నాశనం చేస్తున్నారు- శృంగారపాటి సందీప్, తుళ్లూరు మండలం ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు