ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది' - సీఎం జగన్ తాజా వార్తలు

కరోనా జీవితంలో అంతర్భాగం అవుతుందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. వైరస్‌ సోకినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే నయం అయిపోతుందని చెప్పారు. కరోనా తనతోపాటు ఎవరికైనా సోకవచ్చని అన్నారు.

cm jagan
cm jagan

By

Published : Apr 27, 2020, 6:30 PM IST

Updated : Apr 27, 2020, 9:32 PM IST

ప్రజలనుద్దేశించి సీఎం జగన్ ప్రసంగం

దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్‌ అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీ‌ఎల్‌ ల్యాబ్‌ కూడా లేదని.. ఇప్పుడు 9 చోట్ల కరోనా టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 74,551 మందికి పరీక్షలు చేశామని సీఎం వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అంశాల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సందేశమిచ్చారు.

వారికి హ్యాట్సాఫ్

'కరోనా చికిత్సకు సంబంధించిన ఆస్పత్రులకు ప్రత్యేకంగా వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను దాదాపుగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం. టెలీ మెడిసిన్​ సేవలను అందుబాటులోకి తెచ్చాం.. అవసరమైన మందులను డోర్‌ డెలివరీ చేసేందుకు నెల రోజుల్లోనే చర్యలు చేపట్టాం. ఇప్పటికే రాష్ట్రంలో మూడుసార్లు సర్వే చేశాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టాం. ఈ విషయంలో గ్రామ వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా' అని సీఎం చెప్పారు.

రోగ నిరోధక శక్తే పరిష్కారం

'కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవంగా ఆలోచించాల్సిన అంశం. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుంది. కరోనా సోకితే అంటరానితనమనో.. ఒక భయంకరమైన రోగమనో అనే భావన తొలగిపోవాలి. రాబోయే రోజుల్లో సహజంగా అందరికీ వచ్చే పరిస్థితి ఎక్కువగానే ఉంటుంది. ఇది ఎప్పటికీ తీసేయలేం. మన జీవితంలో ఇది అంతర్భాగం అవుతుంది. స్వైన్‌ఫ్లూ, చికెన్‌ఫాక్స్‌ తరహాలోనిదే ఇది కూడా. అయితే అవన్నీ నయమయ్యే వ్యాధులు. కరోనా సోకిన విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అలాంటి వాళ్లు 80 శాతం మంది ఉన్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేకుండానే వచ్చే అవకాశముంటుంది. ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంట్లో పెద్దవాళ్లను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 81 శాతం కేసులు ఇళ్లల్లో ఉండి నయమైనవి ఉన్నాయి. కరోనా సోకిందని చెప్పుకుంటే అంటరానివాడిననే భావన తీసేయాలి. కరోనా జ్వరం లాంటిదే. భవిష్యత్తులో నాకు కూడా రావచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా నయమవుతుంది. పెద్దవాళ్లకు కాస్త దూరంగా ఉంటే చాలు. ఇది ఎవరికైనా రావొచ్చు. వివక్ష చూపాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంచెం కరోనా లక్షణాలు కనిపించినా తమంతట తామే వైద్యులకు సమాచారమిస్తే మందులిచ్చి వెళ్తారు. దీన్ని ఆ విధంగా భావించాలని అందరినీ వినయపూర్వకంగా కోరుతున్నా. మనంతట మనమే కట్టడి చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోగలిగితే అదే వైరస్​ సమస్యకు పరిష్కారం' అని జగన్‌ అన్నారు.

Last Updated : Apr 27, 2020, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details