రాజధాని పరిధిలోని గుంటూరు నగరంలో తాగునీటి సంక్షోభం నెలకొంది. నగర జనాభా 7 లక్షల వరకూ ఉండగా... నగర పాలక సంస్థలో విలీనమైన పది గ్రామాల జనాభా మరో ఒకటిన్నర లక్షలు ఉంటుంది. జనాభా ప్రాతిపదకిన చూస్తే ప్రతిరోజూ 120 ఎంఎల్‌డీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రకాశం బ్యారేజితో పాటు కృష్ణా కాలువల నుంచి నీటిని పంపింగ్ చేసి పైపు లైన్ల ద్వారా నగరానికి సరఫరా చేస్తారు. అయితే బ్యారేజిలో నీటి కొరత... కాలువల్లో నీరు లేనందున నిర్దేశించిన దానిలో 70శాతం మాత్రమే వస్తోంది. శివారు కాలనీలలో నివసించేవారు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. ఆపార్ట్ మెంట్లలో ఉండేవారు నీటి కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కో అపార్ట్ మెంట్కు రోజుకో ట్యాంకర్ చొప్పున పోయించుకున్నా... నెలకు 30వేల మేర ఖర్చవుతోంది. ప్రతినెల తాగునీటి కోసమే ఒక్కో ఇంటి యజమాని 2నుంచి 3వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ట్యాంకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.
నీరు లేక నగరవాసుల నరకయాతన - water problems
గుంటూరు నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. శివారు కాలనీల్లో మంచినీరు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల తాగునీటి పథకం పూర్తిగా అమలు చేయకపోవడం, ప్రకాశం బ్యారేజిలో నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉన్నందున ప్రజలు ఇక్కట్లు తప్పడం లేదు.
నీటి కోసం పడిగాపులు
గుంటూరు నగరానికి 24గంటల నీటి సరఫరా కోసం సమగ్ర తాగునీటి ప్రాజెక్టు మంజూరైంది. దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయి. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం జరిగినా... కులాయి కనెక్షన్ల మంజూరులో జాప్యం జరిగి సమస్యలు పెరిగాయి. రెండుమూడు నెలలుగా మంచి నీటి కోసం నగరవాసులు నరకయాతన పడుతున్నారు. ఏ సమయంలో నీరు వస్తాయో అర్థం కాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటికీ నాలుగైదు డ్రమ్ములు కొనుగోలు చేసుకుని ఉంచుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకు గానీ ట్యాంకర్ రావటం లేదు. ట్యాంకర్ రాని రోజుల్లో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కనీసం తాగునీరైనా రోజూ సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు తాగునీరు సక్రమంగా సరఫరా చేయటంపై దృష్టి సారించడం లేదని ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.