గుంటూరు జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ జలాశయం నుంచి కొందరు అక్రమంగా మోటార్లతో నీటిని తోడుతున్నారు. మాచర్ల మండలం మేకలగొందు నుంచి అనుపు వరకు సాగర్ జలాశయంలోనే కొందరు అక్రమంగా 50 వరకు మోటార్లు ఏర్పాటు చేశారు. అలాగే సాగర్ కుడి కాల్వపైన డ్యాం నుంచి బుగ్గవాగు వరకు మరికొందరు మోటార్లు బిగించారు. ఈ విధంగా ఏర్పాటు చేసినవి 500 వరకూ ఉన్నాయి. తద్వారా సాగర్ నీటిని అనధికారికంగా వాడుకుంటున్నారు. రోజూ వందలాది క్యూసెక్కుల నీరు చౌర్యానికి గురవుతోంది. దీనివల్ల కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు వెళ్లాల్సిన నీరు తగ్గిపోతుంది.
చూసీ చూడనట్లు...
మోటార్లు వేసుకున్న వారు సొంత అవసరాలతో పాటు వేరే వారికి నీళ్లు సరఫరా చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మోటార్లు కారణంగా ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అక్రమ మోటార్లకు విద్యుత్తు శాఖ అధికారులు కనెక్షన్లు ఇవ్వడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై సాగర్ కుడి కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ గంగరాజును ఈటీవీ భారత్ వివరణ కోరింది. కుడి కాల్వపై నీటిని ఆయకట్టు రైతులు మాత్రమే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇతరులు అక్రమంగా వేసిన మోటార్లను తొలగిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి
డీజీపీని వెంటనే పదవి నుంచి తొలగించాలి: సోము వీర్రాజు