గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఎక్కడినుంచో వచ్చి చేరిన నీటికుక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి చెరువులో ఉండే చెట్లపై విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకొని వెళ్తుంటాయి. ఓరోజు హఠాత్తుగా చెరువులో నీటి కుక్కలు కనిపించటం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన అడపాదడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి. అక్కడినుంచి కృష్ణా కాలువల ద్వారా ఉప్పలపాడు చెరువులోకి చేరి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డజనుకు పైగా నీటి కుక్కల్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
నీటి కుక్కల రాకతో... పర్యాటకుల సందడి
చూసేందుకు ముంగిసలాంటి తలతో.... సీల్ చేపను తలపించే నీటికుక్కల శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తాయి. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. చేపలు వాటికి ప్రధానాహారం. ఉప్పలపాడుకు ఏటా తరలివచ్చే 50 రకాల విదేశీ పక్షులను చూసేందుకు సందర్శకులు తరలి వస్తుంటారు. ఇప్పుడు నీటి కుక్కలు రావడం అదనపు ఆకర్షణగా మారింది. ఉప్పలపాడు చెరువులో చేపలు విస్తారంగా ఉన్నందున నీటికుక్కలకు సమృద్ధిగా ఆహారం దొరకనుంది. కుదిరితే అప్పుడప్పుడూ పక్షులనూ ఆరగిస్తాయి.