Village Development Works: మీ పనులు మాకొద్దు బాబోయ్..! ప్రభుత్వ పనులంటే ఆసక్తి చూపని సర్పంచ్‌లు.. Village Development Works: గ్రామాల్లో రోడ్లు, కాలువల పనులిస్తామంటే.. సొంత పార్టీకి చెందిన సర్పంచులే మాకొద్దు జగనన్న అంటున్నారు. ఇంజినీర్లు ఒత్తిడి తెస్తున్నా మేం చేయమని తెగేసి చెబుతున్నారు. గ్రామాల్లో పనులకు మండలానికి రూ.60 లక్షలు చొప్పున 3 వేల 960 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ 18 జిల్లాల్లో రూ.250 కోట్ల వ్యయం గల పనులకే ప్రతిపాదనలొచ్చాయి. ఇది ప్రభుత్వం పట్ల సొంత పార్టీ సర్పంచుల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పేందుకు ఓ ఉదాహరణ మాత్రమే.
గత ఎన్నికల ముందు చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులివ్వకుండా చేసిన వేధింపులనూ గుర్తు చేసుకుంటున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను.. సొంత పార్టీ సర్పంచులు అని కూడా చూడకుండా.. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ప్రభుత్వం మళ్లించేసిందని తలచుకుంటున్నారు. ఇప్పుడు పనులు చేశాక బిల్లులు ఇవ్వకపోతే.. నిలువునా మునిగిపోవల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.
'ప్రభుత్వ పనులు చేస్తుంటే అప్పుల పాలవుతున్నాం..' బిల్లుల కోసం రోడ్డెక్కిన గుత్తేదారులు
గ్రామాల్లో కొత్త రహదారులు, కాలువల పనులు చేయించేందుకు ఇంజినీర్లు కొన్ని చోట్ల బతిమాలుతున్నా సర్పంచులు ససేమిరా అంటున్నారు. పనులు చేశాక బిల్లులు రాకపోతే బాధ్యత వహిస్తారా అని ఇంజినీర్లను ప్రశ్నిస్తున్నారు. గత 2 నెలల్లో అతి కష్టంమీద 18 జిల్లాల్లో 407 మండలాల నుంచి కొత్త పనులకు ప్రతిపాదనలొచ్చాయి. 8 జిల్లాల్లో 253 మండలాల నుంచి అసలు ప్రతిపాదనలే లేవు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులను పెద్దఎత్తున వినియోగించి గ్రామాల్లో 23 లక్షల కిలో మీటర్లకుపైగా సిమెంట్ రహదారులను నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రహదారుల పనులకు గత నాలుగేళ్లుగా అరకొరగా మెటీరియల్ కాంపొనెంట్ నిధులు కేటాయించింది.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు చేసిన పనులపై ప్రస్తుత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించి బిల్లులు పక్కన పెట్టింది. అప్పట్లో పనులు చేయించిన వారు బిల్లులు రాక అప్పులపాలయ్యారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెండింగ్ బిల్లుల కోసం కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ముందు కొత్త పనులంటే అధికార పార్టీ సర్పంచులు, నేతలే వెనుకడుగు వేస్తున్నారు. సర్పంచులు ఆసక్తి చూపని చోట ఎమ్మెల్యేలు పనులను ప్రతిపాదిస్తున్నారు.
సర్పంచులను ఒప్పించిపనులు చేయిస్తామని వారు చెప్పడంతో కలెక్టర్ల నుంచి ఇంజినీర్లు పరిపాలన అనుమతులు తీసుకుంటున్నారు. ఇంకొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు.. పనులు ప్రతిపాదించే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మెటీరియల్ కాంపొనెంట్ పనులకు 18 జిల్లాల్లో ప్రతిపాదనలు వచ్చినా.. వీటి పరిధిలోని అన్ని మండలాల నుంచి రాలేదు. 483 మండలాల్లో 407 ప్రతిపాదనలొచ్చాయి. కోనసీమ జిల్లాలో 22 మండలాల్లో కేవలం 6 మండలాల నుంచే పనులు ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాలో 37 మండలాల్లో 15, విజయనగరంలో 27 మండలాల్లో 8, కడపలో 35 మండలాల్లో 27, చిత్తూరు జిల్లాలో 31 మండలాల్లో 26, కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో 21 చోట్లే ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలొచ్చాయి.
వంతెన వేయండి మహాప్రభో!.. గత ప్రభుత్వ పనులు రద్దు.. కొత్త పనులు మూడేళ్లు దాటాయి