Venkaiah naidu at sankranti sammelanam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను భారతీయ భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడం పట్ల భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నార్సింగిలో తెలుగు సంగమం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. భారతీయ సంస్కృతిలో భాగమైన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కన్నతల్లి, మాతృభాష, జన్మభూమిని ఎప్పుడూ మర్చిపోవద్దని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రభుత్వాలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మాతృభాషను పరిరక్షించగలుగుతామని పేర్కొన్నారు. ఉన్నత విద్యతో పాటు సాంకేతిక, వైద్య, న్యాయ విద్యల్లోనూ భారతీయ భాషలకు పెద్దపీట వేయాలని కోరారు. చదువు కోసమే కాకుండా పరిపాలన కూడా మాతృభాషలోనే జరగాలని ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు.. ప్రభుత్వాలు ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి తెలుగులో కాపీ ఇవ్వడం సమంజసం కాదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో కోర్టు తీర్పులు కూడా అన్ని భారతీయ భాషల్లోనే ఇవ్వాలని సూచించారు. ఈ వేడుకల్లో వెంకయ్యనాయుడుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రముఖ దర్శకులు రాఘవేందర్రావు, పద్మశ్రీ శోభారాజు, ప్రముఖ రచయిత ఆకెళ్ల, బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్‌రావు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.