ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిద్దె సాగుతో ఆరోగ్యం పదిలం!

ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, నీటితో పాటు నాణ్యమైన ఆహారం కూడా అవసరం. అయితే రసాయనాలు, పురుగుమందుల వాడకం పెరిగిన తరుణంలో మంచి కూరగాయలు దొరకటం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఇళ్లలోనే సేంద్రియ ఎరువుల సాయంతో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మిద్దెతోటల పెంపకం ద్వారా ఇంట్లనే పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. గుంటూరు నగరంలో ఎక్కువమంది ఈ తరహా సాగు సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు.

garden on house
మిద్దె సాగు

By

Published : Jan 15, 2021, 5:23 PM IST

Updated : Jan 15, 2021, 6:05 PM IST

మిద్దె సాగుతో ఆరోగ్యం పదిలం

ఆకుపచ్చని కూరతోటలు... రంగురంగుల పుష్పాలు... వివిధ రకాల పండ్లు... ఇవన్నీ పంట పొలాల్లోనే పెంచటం అనేది నిన్నటి మాట. కానీ ఇప్పుడు నగరాలు, పట్టణాల్లోనూ అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. బాల్కానీలు, మిద్దెలపై సాగవుతున్న తోటలను చూస్తే ఔరా అనిపించక మానదు.

గుంటూరు నగరంలోని ఎస్వీఎన్ కాలనీలో నళిని అనే మహిళ తన ఇంటిని ఓ నందనవనంలా మార్చేశారు. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చదనం, రంగురంగుల పుష్పాలు, రకరకాల కూరగాయలు రారమ్మని స్వాగతం పలుకుతాయి. ఇంటి ప్రాంగణంతో పాటు భవనం పై భాగంలోనూ వివిధ రకాల మొక్కలు నాటారు. దానిమ్మ, జామ, సపోట, డ్రాగన్, అరటి, నిమ్మ, మామిడి, రేగు పండ్లను పండిస్తున్నారు. బంతి, చేమంతి, కనకాంబరాలు, లిల్లీ, మందార, గులాబీ వంటి పూల మొక్కలను పెంచుతున్నారు. వంకాయ, క్యాబేజీ, చిక్కుడు, సొర, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, పసుపు, టమాట, మిర్చి, దోసకాయ వంటి కూరగాయలు... పోషక పదార్థాలు మెండుగా ఉండే పాలకూర, చుక్క కూర, బచ్చలి, మెంతి, పుదీన, కొత్తిమీర, తోటకూర సాగు చేస్తున్నారు. బయట కొనుగోలు చేయకుండా ఇంట్లోకి అవసరమైన పూలు, కూరగాయలు, పండ్లు ఇక్కడి మొక్కల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఈ విధానంతో తమ ఆరోగ్యం ఎంతో బాగుందని చెబుతున్నారు.

'మెుక్కల ఎత్తు, అవి పెరిగే తీరుని బట్టి కుండీలను ఎంపిక చేసుకున్నాం. వాటిలో మట్టి తక్కువగా.. ఎరువు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. సేంద్రీయ ఎరువు, వర్మీ కంపోస్టు, వేప పిండిని ఉండేలా చూసుకుంటాం. ఘన, లేదా ద్రవ జీవామృతాలు ఉపయోగిస్తే.. మెుక్కల ఎదుగుదల బాగుంటుంది.' -నళిని, మిద్దెపై మెుక్కలు సాగు చేస్తున్న మహిళ

మెుక్కలను చీడపీడలు ఆశించకుండా సేద్యానికి సంబంధించిన విధానాలనే అనుసరిస్తున్నట్లు నళిని వివరించారు. సాగు తక్కువగా ఉండే రోజుల్లో తప్ప, మిగతా రోజుల్లో కూరగాయలను కొనాల్సిన అవసరం లేదని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే పండించుకున్న కూరగాయల వలన ఆరోగ్యంగా ఉంటున్నామన్నారు. రోజూ గంట నుంచి రెండు గంటల సమయం కేటాయిస్తే.. మంచి ఆహారంతో పాటు ఆరోగ్యం కూడా తమ సొంతమవుతుందన్నారు.

పచ్చని మెుక్కలు ఉండటంతో పక్షలు సైతం వస్తున్నాయనీ.. ఓ వైపు ఆహ్లాదంగా పచ్చదనం.. మరో వైపు పక్షులను చూస్తుంటే మనసుకు హాయిగా ఉంటుందని.. మిద్దెపై తోటలు పెంచుకుంటున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:395వ రోజుకు చేరుకున్న అమరావతి అన్నదాతల ఆందోళన

Last Updated : Jan 15, 2021, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details