గుంటూరు నగరంలోని కూరగాయల మార్కెట్‌కు ఓ చరిత్ర ఉంది. 1925 నుంచే ఈ ప్రాంతంలో కూరగాయల విక్రయాలు జరిగేవి. ఈ స్థల యజమాని పసుపులేట వెంకట కృష్ణమ నాయుడు 1945లో తన భూమిని అప్పటి గుంటూరు మున్సిపాలిటికి ...మార్కెట్ కోసమని విరాళంగా అందజేశారు. ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూరగాయలు, పండ్లు, పూలు విక్రయించుకునే వారికి అద్దెకిచ్చింది. దాదాపు 10వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అన్నింటికి మించి దుకాణాల అద్దెల రూపంలో గుంటూరు నగరపాలక సంస్థకు ఏడాదికి 80లక్షల రూపాయల పైగానే ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇలాంటి స్థలంపై ప్రభుత్వ కన్ను పడింది. బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ స్థలాలు అమ్మే క్రమంలో మొదటి విడతగా ఎంపిక చేసిన స్థలాల్లో గుంటూరు మార్కెట్ కూడా ఉంది. 1.72 ఎకరాల స్థలాన్ని67.36కోట్ల రూపాయల ధర రిజర్వ్ చేశారు. ప్రజల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తమ తాత పీవీకే నాయుడు ఈ స్థలాన్ని అప్పగిస్తే... ఊరుకోమని ఆయన కుటుంబీకులు తప్పుబడుతున్నారు. దీనిపై పోరాటం చేస్తామని చెబుతున్నారు.
ఈ మార్కెట్ నగరానికి మధ్యలో ఉండటంతో.. అటు రైతులకు, ఇటు వ్యాపారులకు ఇదో అనువైన ప్రదేశం. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు కూరగాయలతో పాటు పండ్లు, పూలు తెచ్చి విక్రయిస్తుంటారు. భౌతిక దూరం కోసం విశాలమైన మైదానంలోకి మార్కెట్‌ను తరలించారు..లాక్‌డైన్ తర్వాత మళ్లీ ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చని అధికారులు చెప్పారని... ఇపుడు మాత్రం మార్కెట్ స్థలాన్ని అమ్మకానికి పెట్టారని వ్యాపారులు వాపోతున్నారు. తమ జీవనాధారాన్ని నాశనం చేయొద్దని వేడుకుంటున్నారు.