సర్వం జగత్తు.. వేద ధర్మం మీదే నడుస్తుందని మహర్షుల భావన. నాస్తికత్వం పెచ్చరిల్లి.. వేద విద్యపై చులకన భావం ఏర్పడుతున్న సమయంలో ఎంతో మంది వేద పండితులను అందిస్తోంది గుంటూరు జిల్లా బాపట్లలోని వేద పాఠశాల. మహారాష్ట్రకు చెందిన మహా తపస్వి పరమహంస బ్రహ్మానంద తీర్థ స్వామి.. శిష్యసమేతంగా పర్యటిస్తూ.. 1917లో బాపట్ల వచ్చి దత్తాత్రేయ మందిరాన్ని నిర్మించారు. వేద, స్మార్త సాహిత్యాన్ని పఠించేందుకు శ్రీ శంకర విద్యాలయాన్ని ప్రారంభించారు. దక్షణాది రాష్ట్రాల్లోనే ప్రప్రథమ వేద, స్మార్త బోధనా శిక్షణాలయం కావడంతో.. ఇక్కడ విద్యను అభ్యసించినవారు.. రాష్టంలోనే కాక దేశ, విదేశాల్లో అర్చకులుగా ఉన్నారు.
వేల మంది వేద పండితులను అందించిన గురుకులం
105 ఏళ్లలో వేల మంది వేద పండితులను ఈ గురుకులం అందించింది. ఈ వేద పాఠశాలలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను బోధిస్తున్నారు. మానవుని పుట్టుక నుంచి మరణం దాకా అన్ని సంస్కారాలు ఎలా నిర్వహించాలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వేద పాఠశాలలో.. 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించడం అదృష్టంగా భావిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు.