Vanasthalipuram Robbery Case : హైదరాబాద్ వనస్థలిపురంలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి వద్ద ఈనెల 6వ తేదీన కొందరు దుండగులు నగదు దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పది రోజుల్లోనే కేసును ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు.
దోపిడీ తర్వాత నిందితులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారని సీపీ చౌహాన్ పేర్కొన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించామని.. నలుగురిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దోపిడీ కేసును ఛేదించామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారని సీపీ చెప్పారు. బార్ యజమాని వెంకట్ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి వచ్చి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక వేశారని వివరించారు. రూ.50 లక్షలు దోపిడీ చేసి రాష్ట్రం వదిలి పారిపోవాలని ప్రణాళిక వేశారన్నారు. డబ్బు తీసుకుని ముంబయి పారిపోయారని.. ముంబయి నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేశారని అన్నారు. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నామని సీపీ చౌహాన్ వెల్లడించారు.
బార్ యజమాని వెంకట్ రెడ్డి వద్ద నిందితులు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చడానికి వచ్చి డబ్బు కొట్టేయాలని ప్రణాళిక వేశారు. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో దోపిడీ చేశారు. దోపిడీ చేసిన డబ్బు తీసుకుని ముంబయి పారిపోయారు. ముంబయి నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేశారు. పారిపోయే క్రమంలో నిందితులను పట్టుకున్నాం. ఈ దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించాం. నలుగురిని అరెస్ట్ చేశాం. మరొకరు పరారీలో ఉన్నారు. - రాచకొండ సీపీ చౌహాన్