గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ 16వ నంబరు జాతీయ రహదారి. బుధవారం ఉదయం 10.30 గంటల సమయం. వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నారు. ఫాస్టాగ్ లైన్లలో కాకుండా వీఐపీ లైన్ వద్దకు వచ్చి వాహనం ఆగింది. టోల్ గేట్ సిబ్బంది వచ్చి కార్పొరేషన్ ఛైర్మన్లకు ఉచితంగా వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో కారు డ్రైవర్ వాహనం దిగి... అక్కడ అడ్డుగా ఉన్న బారికేడ్‌ని కాలితో తన్నారు. సిబ్బంది వారించగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు వాగ్వాదం తర్వాత డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. టోల్ గేట్ ఉద్యోగి ప్రవీణ్ ఈసారి ఇనుప బారికేడ్లు అడ్డుగా ఉంచారు.
సీసీ కెమెరాల్లో రికార్డైన తంతు
ఈసారి దేవళ్ల రేవతి స్వయంగా కారు దిగి వారిపై ఆగ్రహం వెలిబుచ్చారు. బారికేడ్లు తీసేందుకు యత్నించారు. సిబ్బంది వద్దని వారిస్తున్నా బారికేడ్‌ను పక్కకు లాగేశారు. డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు యత్నించారు. సిబ్బంది మరోసారి బారికేడ్లను అడ్డుగా ఉంచారు. ఛైర్ పర్సన్ రేవతి రెండోసారి కూడా బారికేడ్లను లాగేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవటంతో సిబ్బందిపై కోపంతో ఊగిపోయారు. జాతీయ రహదారుల సంస్థ ఉద్యోగి ప్రవీణ్‌పై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సిబ్బంది అవాక్కయ్యారు. మరో అధికారి వచ్చి వాహనం పంపించి వేయమని చెప్పి బారికేడ్లు పక్కకు తీశారు. దీంతో వాహనం ముందుకు వెళ్లిపోయింది. ఈ వ్యవహారం మొత్తం అక్కడే ఉన్న సీసీ టీవీల్లో రికార్డయింది. టోల్ గేట్ సిబ్బంది కూడా తమ ఫోన్లలో ఈ తంతు రికార్డు చేశారు.