గుంటూరు జిల్లాలో కరోనా టీకా కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ విభాగంలో టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేయగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి తొలివిడత టీకా అందించారు. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని మంత్రి ప్రశంసించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు యాంటీ బాడీస్ తయారయ్యే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 43,500 డోసులు..
జిల్లాలో 43,500 డోసులు ఉన్నాయని, తొలి రోజు 2,466మందికి వ్యాక్సినేషన్ అందించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 31కేంద్రాల్లో టీకా అందిస్తున్నామని, వీటి సంఖ్య ఇంకా పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే చికిత్స కోసం అత్యవసర విభాగం సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. రోజుకు వందమందికి టీకా వేస్తామని పేర్కొన్నారు.
బాపట్ల ఏరియా అసుపత్రిలో ఉప సభాపతి కోన రఘుపతి..
బాపట్ల ఏరియా అసుపత్రిలో ఉప సభాపతి కోన రఘుపతి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆసుపత్రి కరస్పాండెంట్ రసూల్ మెుదటి టీకా తీసుకున్నారు. తొలి విడతలో టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో విడత టీకా వేస్తారు.
చినమట్లపూడి గ్రామంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణ రావు..
గుంటూరు జిల్లా నగరం మండలం చినమట్లపూడి గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీకా ప్రక్రియను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన మహమ్మరి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి వ్యాక్సిన్ కనిపెట్టడం శుభ పరిణామమని మోపిదేవి అన్నారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. కరోన నివారణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోఎమ్మెల్యే రజిని..
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకా వేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రజిని తెలిపారు. రోజుకు వంద మందికి చొప్పున ఐదు రోజుల పాటు వ్యాక్సిన్ వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులకు టీకా వేయనున్నట్లు వెల్లడించారు.