ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Polavaram Funds : పొలవరానికి అదనంగా మరిన్ని నిధులు..

Polavaram Funds : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12 వేల 911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి తొలిదశ నిధులేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం ఆదేశాల్లో ఎక్కడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. లైడార్‌ సర్వే ద్వారా 41.15 మీటర్ల పరిధిలో నిర్వాసితులు పెరిగినా.. వారి పునరావాసానికి మాత్రం కేంద్రం నిధులివ్వలేదు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 6, 2023, 1:41 PM IST

పొలవరానికి అదనంగా మరికొన్ని నిధులు..

Center Grant More Funds to Polavaram Project: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి కేంద్రం అదనంగా 12 వేల 911 కోట్ల 15లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ ఆదేశాలను కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డైరెక్టర్‌ జారీ చేశారు. మంత్రిమండలి ముందు తీర్మానం ప్రతిపాదించి ఆమోదం పొందాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించింది. డ్యాంను 45.72 మీటర్ల ఎత్తున నీరు నిలబెట్టేలా పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి. అయితే 41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలబెట్టేందుకు ఎంత ఖర్చవుతుందో, ఆ మేరకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇచ్చిన నిధులను తొలి దశ కింద ఇస్తున్నట్లు కానీ, మలి దశ రూపంలో మళ్లీ నిధులిచ్చే ప్రతిపాదన ఉన్నట్లు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు.

41.15 మీటర్ల ఎత్తుకు పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి 10 వేల 911 కోట్ల 15 లక్షల రూపాయలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించగా.. కేంద్ర జల్‌శక్తి శాఖ మరికొన్ని వివరాలు కోరగా.. ఈ ఏడాది మే నెల ప్రారంభంలో తాజా లెక్కలు రూపొందించారు. డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, ప్రధాన డ్యాంలో పడ్డ అగాథాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనా కూడా కలిపి.. 16 వేల 952 కోట్ల 7 లక్షల రూపాయలు అవసరమని తేల్చారు. పోలవరం అథారిటీకి, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఆ వివరాలను సమర్పించారు. ఈ లోపే పాత అంచనాల మేరకు 10 వేల 911 కోట్ల15 లక్షలను పరిగణనలోకి తీసుకున్నారు. పోలవరంలో డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, పాక్షిక డయాఫ్రం వాల్‌ నిర్మాణం, ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్దపెద్ద అగాథాల పూడ్చివేతకు అంచనా వేసిన 2 వేల కోట్లు కూడా కలిపి... మొత్తం 12 వేల 911 కోట్ల 15 లక్షల రూపాయలకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించడం విశేషం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు రెండుసార్లు పెట్టుబడి వ్యయాన్ని కేంద్రం ఆమోదించింది. 2010-11 ధరల ప్రకారం 16 వేల 10 కోట్ల 45 లక్షల రూపాయలకు తొలిసారి ఆమోదించారు. ఆ తర్వాత 2013-14 ధరల ప్రకారం 20 వేల 398 కోట్ల 81లక్షల రూపాయలు సాగునీటి వ్యయంగా కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించగా.. మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఆ అంచనా ధరలనే ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుని మాత్రమే కేంద్రం నిధులు ఇస్తోంది. ఈ నిధులలో ప్రధాన డ్యాం, ఎడమ, కుడి కాలువలు, భూసేకరణ, పునరావాసం కింద ఏయే విభాగానికి ఎంత నిధులు ఆమోదం పొందాయో ఆ ప్రకారమే ఇస్తోంది. ఒక విభాగంలో ఆమోదం పొందిన పరిమితి మేరకు నిధులివ్వడం పూర్తయితే.. అదే విభాగం కింద అదనపు బిల్లులు సమర్పించినా డీపీఆర్​లో ఆమోదం లేదంటూ పక్కన పెడుతున్నారు. తాజాగా ఆమోదించిన విధానం ప్రకారం అదనంగా ఇవ్వబోయే నిధులకు ఇలాంటి పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఇప్పుడు అదనంగా కేటాయించిన నిధులను ఏ విభాగం పరిధిలోనైనా ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.

2017-18 డీపీఆర్‌ ప్రకారం పోలవరం నిర్మాణానికి 55 వేల 656 కోట్ల 87 లక్షల రూపాయలు అవసరమని కేంద్ర సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది. అయితే 2017-18 ధరల ప్రకారం కేంద్ర రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఆమోదించిన మొత్తం 47 వేల 725 కోట్ల 24 లక్షల రూపాయలు. ఈ మొత్తానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, మంత్రిమండలి ముందు ఉంచి ఆమోదం పొందితే నిధులు ఇచ్చేందుకు వీలయ్యేది. అన్ని దశలు దాటిన ఆ డీపీఆర్‌ను ఆర్థికశాఖ ఆమోదించలేదు. ప్రస్తుతం 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమయ్యే నిధులు అంటూ 12 వేల 911 కోట్ల 15 లక్షల రూపాయలకు ఆమోదించింది.

45.72 మీటర్ల స్థాయికి ప్రాజెక్టు నిర్మించి, తొలుత 41.15 మీటర్లకు నీరు నిలబెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇవి తొలిదశ నిధులే అంటోంది. అయితే కేంద్రం తాజా ఆదేశాల్లో ఎక్కడా తొలిదశ అని ప్రస్తావించలేదు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టాలంటే భూసేకరణ, పునరావాసానికి ఇప్పుడు లెక్కించిన మొత్తం కాకుండా.. అదనంగా 5 వేల127 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తొలి దశలో 41.15 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే.. మరో 36 గ్రామాలు, 16 వేల 642 కుటుంబాలు తొలిదశ నిర్వాసితుల జాబితాలోకే వస్తాయని తాజా లైడార్‌ సర్వేలో తేలినట్లు రాష్ట్ర సర్కార్‌ పేర్కొంది. ఆ నిధులూ కావాలని అంచనాల్లో కోరింది. ఇప్పుడు కేంద్రం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అంటూ మంజూరు చేసిన నిధుల్లో అదనపు మొత్తం లేదు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details