ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

UNEMPLOYMENT IN AP: వాళ్లల్లో 35శాతం మంది నిరుద్యోగులే.. తేల్చిచెప్పిన సీఎంఐఈ సర్వే - Unemployment increased by 10 percent in ap

UNEMPLOYMENT INCREASED IN AP: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ.. పెరిగిపోతోంది. రాష్ట్రంలోని పట్టభద్రుల్లో 35.14శాతం మంది నిరుద్యోగులేనని.. C.M.I.E సర్వేలో తేల్చింది. మూడేళ్లలోనే.. 10శాతం పెరుగుదలతో జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో రెట్టింపు నిరుద్యోగులు ఉన్నారని వెల్లడించింది.

UNEMPLOYMENT IN AP
UNEMPLOYMENT IN AP

By

Published : Apr 19, 2023, 8:20 AM IST

వాళ్లల్లో 35శాతం మంది నిరుద్యోగులే.. తేల్చిచెప్పిన సీఎంఐఈ సర్వే

UNEMPLOYMENT INCREASED IN AP: రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు లభించడం లేదు. జాతీయ సగటు కంటే నిరుద్యోగ పట్టభద్రులు రాష్ట్రంలోనే రెండింతలు అధికంగా ఉన్నారంటే.. సమస్య తీవ్రత ఎంతలా ఉందో తెలుస్తోంది. పెద్ద నగరాలు లేకపోవడం, కొత్తగా పరిశ్రమలు రాకపోవడంతో గత మూడేళ్లలో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 10 శాతం పైగా పెరిగింది. ప్రతి సంవత్సరం లక్షల మంది చదువు పూర్తిచేసి బయటకు వస్తున్నా.. ఉపాధి లభించడం లేదు. ఇంటర్‌ లోపు చదువుకున్నవారు స్థానికంగా దొరికే ఏదో ఒక పనితో సరిపెట్టుకోవడంతో.. ఈ స్థాయిలో నిరుద్యోగిత తక్కువగా ఉండగా.. పట్టభద్రుల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ-CMIEలో తేటతెల్లమైంది. గతేడాది సెప్టెంబర్‌, డిసెంబర్ మధ్య కాలంలో.. 9,264 కుటుంబాలపై C.M.I.E శాంపిల్‌ సర్వే నిర్వహించింది.

రాష్ట్రంలో నిరక్షరాస్యుల్లో ఉపాధి లేనివారు 3.03శాతం మంది ఉంటే.. పట్టభద్రుల్లో 35.14శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. 6 నుంచి 9 తరగతుల వరకూ.. చదివిన వారిలో నిరుద్యోగత 0.06 శాతం ఉండగా.. 10-12 తరగతులు పూర్తిచేసిన వారిలో.. 4.59 శాతం ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 6.16శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో 73 శాతానికి పైగా పట్టభద్రులే ఉన్నారు. జాతీయ స్థాయితో పోలిస్తే.. రాష్ట్రంలో రెండింతలు అధికంగా ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు ఉన్నారు.

జాతీయస్థాయిలో.. పట్టభద్రుల నిరుద్యోగిత సగటున 17.23 శాతం ఉండగా.. రాష్ట్రంలో 35.14శాతంగా ఉంది. పనిచేసే సామర్థ్యం ఉన్న జాబితాలో చేరుతున్న వారిలోనూ డిగ్రీ.. పూర్తి చేసిన వారే అధికంగా ఉంటున్నారు. పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు గత మూడేళ్లలో భారీగా పెరిగింది. 2019లో పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు 24.5శాతం ఉండగా.. 2022 పూర్తయ్యేసరికి ఇది 35.14శాతానికి పెరిగింది. పనిచేయడానికి సిద్ధంగా ఉండి, ఉద్యోగాలు వెతికే వారిలో ప్రతి వెయ్యి మందికి 745మంది పట్టభద్రులు ఉన్నారు. పని చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ఉపాధి కోసం అన్వేషించని కేటగిరిలో ప్రతి వెయ్యిలో 15మంది పట్టభద్రులు ఉన్నారు. ఈ లెక్కన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నా.. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకడం లేదని తేటతెల్లమైంది.

డిగ్రీ కన్నా తక్కువగా చదువుకున్న వారిలో... నిరుద్యోగ రేటు తక్కువగా ఉంది. అంటే వీరు ఏదో ఒక పనితో సరిపెట్టుకున్నారు. ఐదోతరగతి వరకు చదువుకున్నవారు అందరూ పనిలోనే ఉండగా.. తొమ్మిదో తరగతి వరకు చదివిన వారిలో నిరుద్యోగిత ఒక్కశాతం లోపే ఉంది. శ్రామికశక్తిలోకి ప్రవేశించే వారిలో తొమ్మిదో తరగతి వరకు చదివిన వారి.. భాగస్వామ్య రేటు 32శాతం కాగా.. 10 నుంచి 12 తరగతులు పూర్తిచేసినవారి భాగస్వామ్య రేటు 38.8శాతంగా ఉంది. తక్కువ చదువుకుని, శ్రామిక శక్తిలో ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 16.6 మిలియన్ల మంది కార్మికులు ఉండగా వారిలో సుమారు సగం మంది గరిష్ఠంగా తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నవారే ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details