ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..

UnderGround Drainage Works: గ్రామాల్లో మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు.. వైసీపీ సర్కార్ తూట్లు పొడిచింది. ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా భూగర్భంలో ఏర్పాటు చేసే పైపుల ద్వారా సులువుగా గ్రామం బయటకు తరలించేలా రూపొందించిన పథకాన్ని కాలగర్భంలో కలిపేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకూ ప్రస్తుత ప్రభుత్వం బిల్లులివ్వలేదు. మిగిలినచోట్ల పనుల ప్రారంభానికి అనుమతులివ్వలేదు.

UGD_works_in_AP
UGD_works_in_AP

By

Published : Aug 5, 2023, 9:03 AM IST

Updated : Aug 5, 2023, 12:05 PM IST

UGD_works_in_AP

UnderGround Drainage Works: రాష్ట్రంలో రెండు వేల కంటే ఎక్కవ మంది జనాభా ఉన్న 42 పంచాయతీల్లో యూ.జీ.డీ పనులకు 2017-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 383.12 కోట్ల రూపాయల అంచనాలతో 11 వందల 68 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటుకు రెండు విడతలుగా అనుమతులిచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో యూ.జీ.డీ పనులను నిలిపివేసింది. అప్పటివరకు జరిగిన పనుల బిల్లులనూ మంజూరు చేయలేదు. పనులు చేసినా బిల్లులు చెల్లించకపోవడంపై మాజీ సర్పంచులు కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. అసంపూర్తి పనుల కారణంగా ఆయా గ్రామాల్లో దోమలు, ఈగలు, పందుల బెడద తీవ్రమై ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనులు పూర్తి చేసి ఉంటే గ్రామాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేది.

గుంటూరులో భూగర్భ డ్రైనేజీ పనుల్లో తీవ్ర జాప్యం..

UnderGround Drainage Works: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలో 2018లో కోటి 92 లక్షల రూపాయలతో మూడున్నర కిలోమీటర్ల పొడవు పైపులైన్ నిర్మించేందుకు యూ.జీ.డీ పనులు చేపట్టారు. కానీ కోటిన్నర రూపాయల పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారి పనులు నిలిచిపోవడంతో.. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య మొదటికొచ్చింది. నిర్మాణం పూర్తి చేసిన మేరకైనా నిర్వహణ సరిగా చేపట్టకపోవడంతో మురుగునీరు మళ్లీ రోడ్లపైకే వస్తోంది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరంలో 2కోట్ల 30 లక్షల రూపాయల అంచనాలతో యూజీడీ పనులు అయిదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మార్పుతో 90 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాక నిలిచిపోయాయి. అసంపూర్తి పనులతో ప్రజలకు ఉపయోగం లేకపోగా.. మురుగు సమస్యతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది.

యూజీడీ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే గిరిధర్

UnderGround Drainage Works: విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో కోటి 90 లక్షల రూపాయలతో యూ.జీ.డీ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ 2017 సెప్టెంబరులో శంకుస్థాపన చేయగా.. పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయి. ఇదే జిల్లా చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో 90 లక్షల రూపాయల యూ.జీ.డీ పనులను ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో 7కోట్ల 44 లక్షల రూపాయల అంచనాతో 2019 జనవరి 11న శంకుస్థాపన జరిగింది. పైపులైన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. జగన్ అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేయడంతో.. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య మరింత తీవ్రమైంది.

యూజీడీ పనులు సాకు.. ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీకి మంగళం

UnderGround Drainage Works: గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన యూ.జీ.డీ పనులను నిలిపివేసిన జగన్ ప్రభుత్వం.. గత నాలుగేళ్లలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను కూడా.. సర్పంచుల అనుమతి, తీర్మానం లేకుండానే పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద జమ చేసింది. ఆర్థిక సంఘం నిధులు అందకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కరించలేని దుస్థితి నెలకొంది. రహదారులు శుభ్రం చేసే ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వలేదు. పంచాయతీల పట్ల నిర్లక్ష్యం, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపుపై సర్పంచులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు.

Last Updated : Aug 5, 2023, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details